రైలుకు రోడ్ రోలర్ అడ్డు!
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ కొత్త సమస్య ఎదురయింది. బ్యాలట్ పత్రంలో ప్రజారాజ్యం పార్టీకి కేటాయించిన రైల్ ఇంజన్ గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎగబడి తీసుకున్నారు. దీంతో లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల బ్యాలట్ పత్రంలో రైల్ ఇంజన్ తో పాటు రోడ్ రోలర్ కనిపిస్తుంది. రోడ్ రోలర్ అచ్చం రైలింజన్ లాగే ఉండడంతో ప్రజారాజ్యం పార్టీకి పడవలసిన ఓటు రోడ్ రోలరే కు పడే ప్రమాదం వుందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశ్, ప్రజారాజ్యం పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగనుండడంతో ప్రతి ఓటు కీలకమయిందే! ఈ క్రమంలో సుమారు రెండు లక్షల వరకు ఓట్లు ఉండే శాసనసభ, పది లక్షల వరకు ఓటర్లు ఉండే లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ రోలర్ గుర్తుకు రెడు మూడు వేల ఓట్లు పడినా ప్రజారాజ్యం అభ్యర్ధుల జాతకాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంది.
రోలింజన్ గుర్తును పోలినట్టే రోడ్ రోలర్ ఇండడం వల్లే ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు తమ అనుచరులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపి రోడ్ రోలర్ గుర్తును తీసుకుని ఉంటారనిప్రజారజ్యం పార్టీ అనుమానిస్తోంది. బ్యాలట్ పత్రాల్లో రోడ్ రోలర్ గుర్తును మార్చాలని లేదా కనీసం ఆ గుర్తు యాంగిల్ ను మార్చాలనిఎన్నికల కమిషన్ ను కోరాలని ప్రజారాజ్యం పార్టీ భావిస్తోంది. ఈ గుర్తును ఇండిపెండెంట్లు ఎంతగా ఎగబడి తీసుకున్నారంటే, తొలివిడత 22 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 12 స్థానాల్లో రోడ్ రోలర్ గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారని ప్రజారాజ్యం వర్గాలు తెలిపాయి. అలాగే కొన్నిచోట్ల ఇండిపెండెంట్లకు కేటాయించిన డీజిల్ పంపు గుర్తు కూడా రైలింజన్ ను పోలినట్టుగా ఉందని ప్రజారాజ్యం అభ్యర్ధి ఒకరు తెలిపారు. అయితే ఈ గుర్తు ఎక్కువ చోట్ల లేకపోవడం వల్ల పెద్ద సమస్య కాకపోవచ్చనీ, రోడ్ రోలర్ వల్ల మాత్రం పార్టీ అభ్యర్ధులకు పెద్ద ముప్పే వుందని వారు అంటున్నారు.
News Posted: 8 April, 2009
|