చిరు సోదరులదే భారం
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)లో ఎన్నికల ప్రచారం, పోలింగ్ కు సంబంధించి సమన్వయం, వ్యూహరచన, నిర్వహణ, అమలు బాధ్యతలను మోయడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో చిరంజీవి సోదరులే ఆ భారాన్ని తమ భుజస్కందాలపై మోయవలసి వస్తున్నది.ఆ ముగ్గురిలో జ్యేష్ఠుడైన చిరంజీవి, కనిష్ఠుడైన పవన్ కల్యాణ్ ప్రచారం బాధ్యతలు వహిస్తుంటే నాగేంద్ర బాబు సమన్వయం, వ్యూహరచన, అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల బరిలో లేని సీనియర్ నాయకులలో అధిక సంఖ్యాకులు చిరంజీవికి బాసటగా ఉండేందుకు ముందుకు రానందున సోదరులే అన్ని బాధ్యతలూ మోయవలసి వస్తున్నది.
పార్టీలో నంబర్ 2, చిరంజీవి బావమరది అల్లు అరవింద్ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అక్కడ మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 16న ముగిసిన తరువాత మాత్రమే ఆయన హైదరాబాద్ కు తిరిగి రాగలరు. ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో విడుదల ప్రక్రియలు పూర్తి కావడంతో చిరంజీవి నల్లగొండ జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి దశలో పోలింగ్ లో పాల్గొనే వోటర్లను ప్రభావితం చేయడానికి చిరుకు సరిగ్గా ఒక వారం వ్యవధి మాత్రమే ఉంది. చిరంజీవి మూడు రోజుల పాటు తెలంగాణలోను, మరి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర లోను ప్రచారం చేస్తారు. ప్రచారానికి గడువు ముగిసే లోగా సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో ప్రసంగించడానికి ఆయన ఒక చోట నుంచి మరొక చోటకు హెలికాప్టర్ లో తిరుగుతుంటారు.
ఇక పవన్ కల్యాణ్ మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం సాగించారు. ఆయన వచ్చే రెండు మూడు రోజులలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ప్రచారం సాగించవచ్చు. ఆయన ఆదివారం తరువాత తన పెద్దన్నగారితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా వెళుతున్నారు.నాగేంద్ర బాబు ఇప్పటికే వెనుక ఉండి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాలలో అభ్యర్థులు సాగిస్తున్న ప్రచారాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. వివిధ నియోజకవర్గాలలో ఇతర పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రచారం తీరును కూడా ఆయన గమనిస్తున్నారు. అంతే కాదు. తమ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంటున్న లోటుపాట్ల గురించి పార్టీ అభ్యర్థుల దృష్టికి నాగేంద్రబాబు తీసుకువస్తున్నారు కూడా. వివిధ నియోజకవర్గాలలో అసంతృప్తి చెందిన నాయకులను, ఇతర నాయకులను అధికార అభ్యర్థులకు మద్దతుగా సమీకృతమయ్యేట్లు కూడా ఆయన చూస్తున్నారు. చేగొండి హరిరామ జోగయ్య, కోటగిరి విద్యాధరరావు, పర్వతనేని ఉపేంద్ర, పి. శివశంకర్, సి. ఆంజనేయరెడ్డి, కె.ఎస్.ఆర్. మూర్తి, కిమిడి కళా వెంకటరావు, తమ్మినేని సీతారామ్, భూమా నాగిరెడ్డి, సి. రామచంద్రయ్య, పరకాల ప్రభాకర్, డాక్టర్ మిత్రా, జ్యోతుల నెహ్రూ, వి. రాధాకృష్ణ వంటి అనుభవజ్ఞులైన నాయకుల శ్రేణితో ఆదిలో పటిష్ఠంగా కనిపించిన ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు నిస్సహాయ శిశువులా గోచరిస్తున్నది.
News Posted: 8 April, 2009
|