ధనిక అభ్యర్థులపై ఐటి కన్ను
హైదరాబాద్ : రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు తమ నామినేషన్లతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లలో బాగా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని చూపడంతో దిగ్భ్రాంతి చెందిన ఆదాయపు పన్ను (ఐటి) అటువంటి 50 అఫిడవిట్లను తీసుకుని, దానికి ఐటి చెల్లించారా లేదా అనేది తేల్చుకునేందుకు దర్యాప్తు జరపాలని నిశ్చయించింది. ఎన్నికల కమిషన్ వద్ద దాఖలయ్యే ప్రతి అఫిడవిట్ కాపీ ఒకటి ఐటి శాఖకు అందుతున్నప్పటికీ, కొందరు వెల్లడి చేసిన అధికాదాయానికి అధికారులు కలవరం చెందారని, అగ్ర ప్రాధాన్యం ఇచ్చి దీనిపై దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయించుకున్నారని ఐటి శాఖ వర్గాలు తెలియజేశాయి.
'ఈ కేసులలో మా అంతట మేముగా అఫిడవిట్ల పరిశీలనను చేపట్టాం. అవి క్రమంగా మా కార్యాలయానికి అందేంత వరకు వేచి ఉండడం లేదు' అని ఐటి శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఐటి అలా దర్యాప్తు కోసం స్వీకరించిన 50 అఫిడవిట్లలో విజయవాడ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ (రూ. 229 కోట్లు), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు,తిరుపతి, పాలకొల్లు శాసనసభ స్థానాలకు అభ్యర్థి చిరంజీవి (రూ. 88 కోట్లు), పిఆర్పీ ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్ (రూ. 24 కోట్లు), నిజామాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ (రూ. 30 కోట్లు), కడప లోక్ సభ స్థానానికి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి పి. శ్రీకాంత్ రెడ్డి (రూ. 30 కోట్లు) కూడా ఉన్నారు.
ఆ అభ్యర్థులు తాము వెల్లడి చేసిన ఆస్తులకు ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనేది నిర్థారించుకోవడమే ఆ అఫిడవిట్లను పరిశీలనకు స్వీకరించడంలో ప్రధానోద్దేశమని ఐటి వర్గాలు వివరించాయి. 'అయితే, అభ్యర్థుల కుటుంబ సభ్యుల ఆస్తులపై కూడా దర్యాప్తు జరుపుతాం. గుప్త ధనం వెలికితీతకు లేదా పన్ను చెల్లించని ఆస్తుల వెలికితీతకు ఇది దోహదం చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.ఇది ఇలా ఉండగా, ఐటి శాఖ ప్రాథమిక మదింపు ప్రకారం, రాష్ట్రంలో ప్రతి శాసనసభ అభ్యర్థీ రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని ఐటి వర్గాలు సూచించాయి. 'ఒక సీటుకు ముగ్గురు ప్రధాన అభ్యర్థులు వంతున నియోజకవర్గానికి ఈ ఖర్చు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఉండగలదు. అంటే, ఈ ఎన్నికలలో మొత్తం ఖర్చు బృహత్ స్థాయిలో రూ. 4500 కోట్ల మేరకు ఉండగలదు' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అదనపు కమిషనర్లు, కమిషనర్లు హోదా గల దాదాపు 60 మంది ఐటి అధికారులను ఈ ఎన్నికల కోసం పరిశీలకులుగా నియమించారు.
News Posted: 8 April, 2009
|