అక్కడ అంతా నిశ్శబ్దమే
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని వివిధ పార్టీల కార్యాలయాలలో హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు. నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. చివరకు సచివాలయంలో కూడా నిశ్శబ్దం తాండవిస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన గాంధి భవన్ దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. ఎవరో ఒకరిద్దరు నాయకులు మాత్రం వచ్చిపోతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి అప్పుడప్పుడు నిర్వహించే విలేకరుల గోష్ఠులు మినహా గాంధి భవన్ లో కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు జరిగే విలేకరుల సమావేశాలలోతప్పిస్తే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎంఐఎం, సిపిఐ, సిపిఎం శాసనసభా పక్షాల కార్యాలయాలు కూడా దాదాపు నిర్మానుష్యంగా మారిపోయాయి.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ లేని కారణంగా ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య పార్టీ తరఫున వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి, శ్రీనివాస్ నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పరిస్థితి కూడా గాంధి భవన్ కు భిన్నంగా ఏమీ లేదు. ఈ పరిస్థితి వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో రాష్ట్రం అంతటి నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆ చిన్న వర్తకులు మంచి లాభసాటి వ్యాపారాలు చేసుకున్నారు.
'అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన తరువాత అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొనేవారే కరవయ్యారు' అని కాటన్ దుస్తులు అమ్మే నారాయణ వాపోయాడు. టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. కొద్ది మంది ఆఫీసు సిబ్బంది మినహా నాయకులు ఎవరూ తెలంగాణ భవన్ కు రావడం లేదు. 'అంతా ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. అందువల్ల ఇక్కడ నాయకులు కనిపించడం లేదు' అని ఎంఎల్ సి కె. దిలీప్ కుమార్ చెప్పారు.
News Posted: 9 April, 2009
|