తెదేపా హోర్డింగ్ ల ప్రచారం
హైదరాబాద్ : వోటర్ల దృష్టిలో పడడానికై తెలుగు దేశం పార్టీ (టిడిపి) హైదరాబాద్ నగరంలో పలు ముఖ్యమైన ప్రదేశాలలో తన పథకాల గురించి ప్రకటనల హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తున్నది. రాజకీయ నినాదాలు, ప్రచారం కోసం ప్రైవేట్, ప్రభుత్వ భవనాల గోడలను ఉపయోగించుకునే పార్టీలపై ఎన్నికల కమిషన్ (ఇసి) డేగ కన్ను వేయడంతో వాణిజ్య మార్కెట్ లో ఔట్ డోర్ ప్రకటనల అవకాశం కోసం పార్టీలకు ఏజెన్సీలను ఆశ్రయించడం వినా మార్గాంతరం లేకపోతున్నది.
తన ఎన్నికల ప్రణాళికను హైలైట్ చేయడానికై టిడిపి నగరంలో పలు హోర్డింగ్ లను రిజర్వ్ చేసుకున్నది. ఆధునిక బస్ షెల్టర్లకు 'పసుపు' రంగు పూయడం ద్వారా టిడిపి సమాజంలోని దిగువ, మధ్య తరగతి ప్రజలను ప్రధానంగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. తన ఎన్నికల ప్రణాళికలో పొందుపరచిన నగదు బదలీ పథకం, ఉచిత రంగుల టివి సెట్లు, ఉచిత బియ్యం పంపిణీ వంటి పథకాల గురించిన ప్రచారానికి టిడిపి బస్ షెల్టర్లను ఉపయోగించుకుంటున్నది.
'మా పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నగరాన్ని అభివృద్ధి చేయడంపై సదా అమితాసక్తి కనబరుస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే నగరంలో పలు నియోజకవర్గాలకు టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్నది' అని టిడిపి నగర శాఖ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఈ విషయంలో తాను వెనుకబడకూడదనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన పథకాల గురించిన ప్రచారానికి అనేక హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది. పోలీస్ లైన్స్ వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మందస్మిత వదనంతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ఆ హోర్డింగ్ హైలైట్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ కూడా హోర్డింగ్ ల ద్వారా ప్రచారానికి ఉపక్రమిస్తున్నాయి.
News Posted: 10 April, 2009
|