రెబెల్స్ మధ్య 'రెబెల్ స్టార్'
హైదరాబాద్: రాజుగారికి ఏ సీటు ఇస్తున్నారని అడిగితే, 'ఆయన కోరితే నా సీటైనా ఇచ్చేస్తాను' అన్నారు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అంటే చాలామందికి తెలియకపోవచ్చు కాని 'రెబెల్'స్టార్ గా ఆయన తెలుగువారందరికీ సుపరిచితులే! దగ్గర బంధువుల సీట్లు కూడా లాక్కోడానికి ఎవరూ వెనకాడని ఈ రాజకీయాల్లో తన సీటైనా ఇచ్చేస్తానని చెప్పడంతోనే చిరంజీవికి ఆయనంటే ఎంత గౌరవమో అర్ధమవుతుంది. వారి పరిచయం మూడు దశాబ్దాల నాటిది. అప్పట్లో కృష్ణంరాజు నిర్మించి, హీరోగా నటించిన మనవూరి పాండవులు సినిమాలో పాండవ మధ్యముడు 'పార్థు'డి పాత్రలో నటించారు చిరంజీవి. ఆ తరువాత మెగాస్టార్ గా ఎదిగి, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాక, నన్నూ చేర్చుకోండంటూ వచ్చారు, రాజకీయాల్లో చిరంజీవి కంటె ఎంతో అనుభవజ్ఞుడైన కృష్ణంరాజు.
పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి సొంత వూరు మొగల్తూరులోనే 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. డిగ్రీ పూర్తి చేశారు. పాపులర్ హీరోయిన్ కృష్ణకుమారి హీరోయిన్ గా ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన చిలకా గోరింకతో సినీరంగంలో హీరోగా అడుగుపెట్టిన కృష్ణంరాజు 183 సినిమాల్లో హీరోగా, విలన్ గా, కేరక్టర్ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు ధరించారు. గోపీకృష్ణ బ్యానర్ పై స్వయంగా అమరదీపం,భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించి ఆ రోజుల్లోనే రెబెల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. సినీ జీవితంలోనే కొంత సమయాన్ని ప్రజాసేవకు వినియోగించేవారు. గోపీకృష్ణ గ్రానైట్స్ కంపెనీని స్థాపించి పారిశ్రామిక రంగంలో కూడా అనుభవం సంపాదించారు.
కొన్నాళ్ల తరువాత రాజకీయరంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు కాకినాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1990లో బిజెపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎన్నికైన నలుగురు ఎంపిలలో నర్సాపురం అభ్యర్ధిగా మళ్లీ ఎన్నికై, 1999-24 మధ్య వాజ్ పేయి ప్రభుత్వంలో విదేశ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజారాజ్యం టిక్కెట్ పై రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. బయటివారికి టిక్కెట్టిచ్చారంటూ ప్రజారాజ్యం నుంచి తప్పుకున్న స్థానిక నాయకుల 'తిరుగుబాటు'ను ఎదుర్కొంటున్నారు అరవై తొమ్మిదేళ్ల ఈ రెబెల్ స్టార్!
News Posted: 11 April, 2009
|