మట్టికరచిన ప్రముఖులు
భోపాల్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి మధ్య సామ్యం ఏమిటి? ఉభయులూ మధ్య ప్రదేశ్ లో ఎన్నికలలో మట్టి కరిచారు. ఇదే రాష్ట్రంలో ఇంకా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఓటమిని చవి చూశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) వ్యవస్థాపకుడు కాన్షీ రామ్, సుప్రసిద్ధ స్వాతంత్ర్య యోధుడు ఆచార్య జె.బి. కృపలానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్, అర్జున్ సింగ్ కూడా ఎన్నికలలో పరాజయాన్ని మూటకట్టుకున్నవారే. ఈ జాబితా ఇక్కడితే ఆగిపోవడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పచౌరి, మహాత్మా గాంధి మనవడు రాజ్ మోహన్ గాంధి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విద్యా చరణ్ శుక్లా, కమల్ నాథ్ కూడా లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయారు.
ఎమర్జన్సీ అనంతరం డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1977లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనం కారణంగా భారతీయ లోక్ దళ్ (బిఎల్ డి) అభ్యర్థి ఆరిఫ్ బేగ్ చేతిలో పరాజయం పొందారు. వాజపేయి 1984 ఎన్నికలలో తన స్వస్థలం గ్వాలియర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా చేతిలో ఓడిపోయారు. మాధవరావు సింధియా లక్షా 75 వేల పైచిలుకు వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాన్షీరామ్ కూడా అదే సంవత్సరం జాంజ్ గిర్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 8.81 శాతం వోట్లతో మూడవ స్థానం మాత్రమే పొందారు. జాంజ్ గిర్ నియోజకవర్గం ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఉంది.
ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ రాజధానిగా ఉన్న రాయిపూర్ నుంచి ఆచార్య కృపలానీ 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాని ఆయన కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ లాల్ గుప్తా చేతిలో పరాజయం పొందారు. 1996 ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అర్జున్ సింగ్ సాత్నా నియోజకవర్గంలో మట్టి కరిచారు. బిఎస్ పి అభ్యర్థి సుఖ్ లాల్ కుష్వాహా తన సమీప ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర కుమార్ సక్లేచాను ఓడించి సాత్నా సీటును కైవసం చేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా 1977 ఎన్నికలలో రాయిపూర్ నియోజకవర్గంలో బిఎల్ డి అభ్యర్థి పురుషోత్తమ్ కౌశిక్ చేతిలో ఓడిపోయారు.1977లోనే కమల్ నాథ్ ఛింద్వారాలో ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా చేతిలో ఓటమి చవి చూశారు. 1989లో రఘోగఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను బిజెపి సీనియర్ నాయకుడు ప్యారేలాల్ ఖండేల్వాల్ ఓడించారు. ఖండేల్వాల్ కు 53.3 శాతం వోట్లు రాగా దిగ్విజయ్ సింగ్ 41.1 శాతం వోట్లు మాత్రమే లభించాయి. మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరి 1999లో అప్పటి బిజెపి నాయకురాలు ఉమాభారతి చేతిలో ఓడిపోయారు. ఉమాభారతికి 55.09 శాతం వోట్లు రాగా పచౌరికి 37.79 శాతం మాత్రమే వోట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ను దెబ్బ తీయడానికి బిజెపి రఘోగఢ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను నిలబెట్టింది. కాని దిగ్విజయ్ సింగ్ గెలిచారు.
News Posted: 12 April, 2009
|