కెసిఆర్ పుత్ర ప్రేమ
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నతన కుమారుడు కె. తారక రామారావు తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎందుకు ప్రచారం చేయడం లేదు? కెసిఆర్ ఇంతవరకు సిరిసిల్లకు వెళ్ళకపోవడానికి కారణాలపై టిఆర్ఎస్ వర్గాలలో రకరకాల కథనాలు వినవస్తున్నాయి. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పట్టించుకోకుండా తన కుమారునికి పార్టీ టిక్కెట్ ఇచ్చినందుకు పార్టీ సిద్ధాంతకర్తలతో సహా వివిధ వర్గాల నుంచి చంద్రశేఖరరావు విమర్శలు ఎదుర్కొన్నారు. కెసిఆర్ వైఖరికి ఆగ్రహించిన టిఆర్ఎస్ విధేయుడు, పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడుగా కొనసాగుతున్న కె.కె. మహేందర్ రెడ్డి సిరిసిల్లలో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 16న జరగనున్న ఎన్నికలకు ముందు కెటిఆర్ కు ఆయన తన ప్రచారంతో ముచ్చెమ్మటలు పట్టిస్తున్నారు.
మహేందర్ రెడ్డి పట్ల వ్యవహరించిన తీరుకు మండిపడుతున్న పార్టీ కార్యకర్తల నిరసన ప్రదర్శనలను తప్పించుకునేందుకే కెంసిఆర్ సిరిసిల్లకు దూరంగా ఉంటున్నారని ఒక కథనం. టిఆర్ఎస్ కు వీరవిధేయులైన కార్యకర్తలు ఇప్పటికే కొన్ని చోట్ల కెటిఆర్ ప్రచారాన్ని అడ్డుకున్నారు.సిరిసిల్లలో తన కుమారునికి టిక్కెట్ ఇవ్వడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో టిఆర్ఎస్ అధ్యక్షునికి ఇదివరకే కొందరు నాయకులు, కార్యకర్తలు విశదం చేశారు. తన కుమారుని నిలబెట్టాలన్న కెసిఆర్ నిర్ణయం స్థానిక కార్యకర్తలకే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగాను, పొరుగున ఉన్న వరంగల్ జిల్లాలో కార్యకర్తలకు కూడా ఆగ్రహం కలిగించింది. ఇది చాలదన్నట్లుగా మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన సిపిఐ కూడా మహేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని అనధికారికంగా నిశ్చయించుకున్నది. తనకు (సిపిఐకి) కేటాయించిన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టినందుకు ఆయనకు గుణపాఠం నేర్పాలని సిపిఐ నిశ్చయించింది.
News Posted: 13 April, 2009
|