ఉచితానుచితాలకు గుడ్ బై!
హైదరాబాద్ : ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకులు వాడుతున్న పదజాలం హీనంగా మారిపోతున్నది. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకులను 'పందికొక్కులు'గాను, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంను 'దెయ్యాల పాలన'గాను అభివర్ణించారు. ఇక వైఎస్ అయితే, చంద్రబాబు నాయుడును 'పిట్టల దొర'గా పేర్కొన్నారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని 'కల్లు తాగిన కోతి' అని అభివర్ణించారు. డాక్టర్ నారాయణ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నట్లుగా భూ పోరాటాన్ని అణచివేసినందుకు ముఖ్యమంత్రిని జైలులో పెట్టాలని అన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులను నారాయణ బందిపోట్లుగా పేర్కొన్నారు.
మామూలుగానే మాటల తూటాలు వదలడంలో ఏమాత్రం సంయమనం పాటించని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీని 'వెయ్యి తలల విష సర్పం'గా అభివర్ణించారు. దానిని పది కిలో మీటర్ల లోతులో నేలలో పాతిపెట్టవలసిందిగా ప్రజలకు కెసిఆర్ పిలుపు ఇచ్చారు.అయితే, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి మాత్రం పరుష పదజాలం వాడడం లేదు. ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు 'ఫ్రీ ఆల్ బాబు'. డాక్టర్ రాజశేఖరరెడ్డిని చిరంజీవి 'రియల్ ఎస్టేట్ హీరో' అని అభివర్ణిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ప్రచారం సాగిస్తున్న నటుడు రాజశేఖర్ విమర్శలకు నాజూకు మాటలు ఉపయోగించడం లేదు. ఆయన చిరంజీవిని 'మేక వన్నె పులి'గా పేర్కొన్నారు.
అయితే, వినడానికి, రాయడానికి రోత పుట్టించే విధంగా పరుష పదజాలంతో పోరు టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ మధ్య సాగుతోంది. ఇతరులు కూడా మధ్యమధ్యలో వారితో కలుస్తున్నారు. తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం సాగిస్తున్న ప్రముఖ నటుడు, ఎన్.టి. రామారావు కుమారుడు బాలకృష్ణ ఉపన్యాస కేసరి కాకపోవచ్చు కాని ప్రతి రోడ్ షోలో తన తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి \విన్యాసాలు చేస్తున్నారు. ఆయన చివరకు తన సోదరి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటి ముందు కూడా ఈ విన్యాసాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య ఈ మాటల తూటాలపై వ్యాఖ్యానిస్తూ, 'రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో సభ్యతను పాటించాలి. తొడ చరచడం, మీసం మెలివేయడం వంటివి అటువంటి పనులు చేసే వ్యక్తి రాజకీయ అపరిపక్వతను సూచిస్తాయి' అని అన్నారు.
News Posted: 13 April, 2009
|