కలర్ టివిల ప్రచారార్భాటం
హైదరాబాద్ : ఈ నెల 16న జరిగే మొదటి దశ ఎన్నికలకు ప్రచారం మంగళవారం ముగియనుండగా మహా కూటమి భాగస్వామ్య పక్షాలు తాము ప్రకటించిన రెండు వరాల గురించి చాలా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నాయి. కలర్ టివిలను ఉచితంగా పంపిణీ చేస్తామని, నగదు బదలీ పథకాన్ని అమలు జరుపుతామని మహా కూటమి వాగ్దానం చేసింది. మరొక వైపు ఆ వరాల ప్రభావాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ తన వంతుగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నది. తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), వామపక్షాలు ఆదిలో తమ ప్రచారంలో ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించినా పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ఉచిత కలర్ టివిలు, నగదు బదలీ పథకాల గురించి టముకు కొట్టి మరీ ప్రచారం చేయసాగాయి.
టిడిపి టివి ప్రకటనలలో నగదు పథకం గురించి నిరంతరాయంగా ప్రస్తావిస్తున్నారు. 'ఈ పథకం వల్ల ఒక్కసారిగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది. పిల్లలు చదువుకోవడానికి, దారిద్ర్యంతో మగ్గుతున్న కుటుంబాలు ఒడ్డున పడడానికి ఈ పథకం దోహదం చేస్తుంది' అన్నది ఆ ప్రకటనల సారాంశం. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఇజి) పథకం కన్నా కూడా నగదు బదలీ పథకం పదింతలు ప్రయోజనకరమని మహా కూటమి వోటర్లకు చెబుతున్నది. 'ఎన్ఆర్ఇజి ద్వారా కార్మికులకు 100 రోజులు మాత్రమే పని దొరుకుతుంది కనుక వారికి ఏడాదికి రూ. 10 వేలు మాత్రమే లభిస్తాయి. కాని టిడిపి నగదు బదలీ పథకం వల్ల ఒక్కొక్క బిపిఎల్ కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు లభిస్తాి. ఇది రోజుకు రూ. 100 వంతున 240 రోజుల పనికి సమానం' అని టిడిపి నాయకుడు ఒకరు వివరించారు.
టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, 'మీరు కాంగ్రెస్ ఇవ్వజూపే మద్యం సీసాకు ప్రలోభపడితే మీరు రంగుల టివిని, నగదు రూపేణా భారీ లాభాన్ని కోల్పోతారు' అని అన్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నది. ఈ పథకం అమలుకు సాధ్యం కానిదని, హానికరమైనదని పేర్కొంటూ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఇతర నాయకులు ఈ పథకాన్ని తప్పు పట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 'ఈ పథకాల కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో వారు చెప్పలేకపోతున్నారు' అని సిఎం పేర్కొన్నారు. మహా కూటమి ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి కాంగ్రెస్ సాంస్కృతిక బృందాలను రంగంలోకి దింపింది. అటువంటి ఒక బృందం రాహుల్ గాంధి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక సభలో ప్రదర్శన ఇచ్చింది. టివి చూడడం పిల్లల ఆరోగ్యానికి చేటు అని ఆ ప్రదర్శన సారాంశం. ఉచిత కలర్ టివిల ప్రలోభానికి గురి కావద్దని జనాన్ని మరొక బృందం శనివారం కోరింది. కాగా, నగదు బదలీ పథకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య గర్హిస్తూ, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పకుండా జనాన్ని చంద్రబాబు నాయుడు వంచిస్తున్నారని ఆరోపించారు.
News Posted: 14 April, 2009
|