ఇద్దరు సిఎంల గ్రామం
తిరుపతి : ప్రజలకు ఇద్దరు ఎంఎల్ఎలు, ఇద్దరు ఎంపిలు, ఇంకా ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదేశం ఒకటి ఉంది తెలుసా. ఆ ప్రదేశం కనకమ్మ సత్రం లేదా కనకమ్మ ఛత్రం. తిరుపతి - తిరుత్తణి - చెన్నై రోడ్డులో ఉన్న గ్రామం అది. ఆ రోడ్డు నిజంగా గ్రామాన్ని రెండుగా విభజిస్తున్నది. ఒక భాగం ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి, రెండవ భాగం తమిళనాడు పరిధిలోకి వస్తాయి. సాంకేతికంగా ప్రస్తావించాలంటే 2400 జనాభా ఉన్న గ్రామంలో ముప్పాతిక వంతును తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణి తాలూకా, కనకమ్మ ఛత్రంగా పేర్కొంటుంటారు. సరిహద్దుగా భావించే రోడ్డుకు ఇవతల ఉండే రెండవ భాగాన్ని చిత్తూరు జిల్లా విజయపురం మండలం మహారాజపురం పంచాయతీగా పేర్కొంటుంటారు. కనకమ్మ ఛత్రంలోని 2400 జనాభాలో 800 మంది ఆంధ్రులు, మిగిలివారు తమిళులు.
ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి వచ్చే, సాధారణంగా పేర్కొనే మహారాజపురం పంచాయతీలోని కనకమ్మ సత్రం రోడ్డు ప్రాంతానికి చెందిన అర్హులైన 150 మంది వోటర్లు సత్రానికి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలోని మహారాజపురం గ్రామానికి వెళ్ళి తమ వోట్లు వేస్తుంటారు. కనకమ్మ సత్రం సర్పంచ్ టి. రాజేంద్రన్ సమాచారం ప్రకారం, ఆంధ్రులు నగరి అసెంబ్లీ స్థానానికి, తిరుపతి (ఇప్పుడు చిత్తూరు) పార్లమెంటరీ స్థానానికి వోట్లు వేస్తుంటారు. తమిళులు తిరుత్తణి శాసనసభ స్థానానికి, తిరువళ్ళూరు పార్లమెంటరీ స్థానానికి వోట్లు వేస్తుంటారు.'ఇక్కడి ప్రజలకు రెండు వైపుల బంధువులు ఉన్నారు. ఒక వైపు వారి నిర్ణయం రెండవ వైపు వారిని ప్రభావితం చేస్తుంటుంది' అని ఆయన చెప్పారు. 'గత ఎన్నికలలో రోజా నగరి నుంచి పోటీ చేసినప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వవలసిందిగా అమ్మ (రాజేంద్రన్ ఎఐఎడిఎంకె సభ్యుడు) మమ్మల్ని కోరారు. ఇక్కడి ఆంధ్ర వోటర్లతో పాటు రెండవ వైపు ఉన్న శ్రీహరిపురం, మల్లారెడ్డి కండ్రిగలలోని తమిళ వోటర్లపై పలుకుబడి ఉపయోగించగలం. అయితే, ఈసారి అటువంటి ఆదేశాలు ఏవీ లేవు. అందువల్ల మేము మౌనం వహించాం' అని రాజేంద్రన్ తెలియజేశారు.
ఒక్క వోటు ఎన్నికల ఫలితాన్నే మార్చగల తరుణంలో కనకమ్మ సత్రంలోని 150 పైచిలుకు వోట్లు ఎంతో మార్పును తీసుకురావచ్చు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పార్టీలు గ్రామంలో ప్రచారం చేస్తుంటాయి. గతంలో ఎన్నికల సమయంలో ఈ విలక్షణ గ్రామంలో తెలుగు దేశం పార్టీ (టిడిపి), కాంగ్రెస్, డిఎంకె, ఎఐఎడిఎంకె పోస్టర్లు, జెండాలు కనిపించాయి. అయితే, ఈ దఫా ఎన్నికల కమిషన్ (ఇసి) ప్రవర్తన నియమావళి కారణంగా అటువంటిదేమీ కనిపించడం లేదు. ఈ గ్రామం మరొక విషయంలో కూడా విలక్షణమైనదే. ఆంక్షలు లేదా నిషేధాలు ఏవైనా అమలులో ఉన్నప్పుడు వాటి ప్రభావం ఇక్కడ నామమాత్రంగా ఉంటుంటుంది. ఉదాహరణకు, కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పుడు మద్యపాన ప్రియులకు కనకమ్మ సత్రం (కెఎస్) స్వర్గధామంలా ఉంటుండేది. రోడ్డుకు ఆవల తమిళనాడు వైపు మద్యం దుకాణాలు ఉండేవి. కాని కొన్ని సంవత్సరాలుగదా పరిస్థితిలో మార్పు వచ్చింది. కెఎస్ కు ఈవల ఆంధ్ర ప్రదేశ్ వైపు మద్యం దుకాణాలు ఉంటుండగా ఆవలి వైపు ఆ దుకాణాలు ఏవీ లేవు. ఇప్పుడు కెఎస్ గ్రామంలోని 150 మందికి పైగా వోటర్లు ఎవరికి వేస్తారా అని నగరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.
News Posted: 15 April, 2009
|