తడాఖా చూపుతున్న పోసాని
చిలకలూరిపేట : సినీ కథా రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తత్వం ఎవరికీ అంతుపట్టదనే సంగతి చిత్ర పరిశ్రమలో చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావిస్తున్నది చిత్రరంగానికి సంబంధించిన అంశంపై కాదు. మెగాస్టార్ చిరంజీవికి 'మంచి మిత్రుడు' అయిన పోసాని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)లో చేరారు. ఆతరువాత సొంత జిల్లా గుంటూరులోని చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి పార్టీ టిక్కెట్ కూడా పాందారాయన. విలక్షణ మనస్తత్వం గల పోసాని తన వైఖరితో సొంత పార్టీ కేడర్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తన ప్రచారం మొదటి రోజు ఆయన తన పార్టీ కేడర్ తో ఇలా అన్నారు: 'నా వెంట తిరిగినందుకు మీకు నేనేమీ చెల్లించబోవడం లేదు. మీకు ఆహారం లేదా మద్యం కూడా సమకూర్చను. చిరంజీవిని సిఎంగా చూడాలని ఆకాంక్షిస్తేనే నాతో పాటు తిరగండి. లేదా వెళ్ళిపోండి'.
'డబ్బులు అడిగిన వాడు, తీసుకుని ప్రచారం చేసే వాడు ఇద్దరూ వెధవలు' అని ఆయన అన్నారు. దీనితో బిత్తరపోయిన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలలో కొందరు నిజంగా నిరుపేదలని ఆయనకు వివరించేందుకు ప్రయత్నించారు కాని ఫలితం లేకపోయింది.'డబ్బు పంపిణీ చేయవలసిందని చిరంజీవి నన్ను కోరినట్లయితే నేను ఆయన కాలర్ పుచ్చుకుంటాను' అని పోసాని అన్నప్పుడు కేడర్లకు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈమధ్య ఒక రోజు తన మూలాల గురించి ప్రశ్నించినందుకు మీడియా సిబ్బందితో పోసాని అమితాగ్రహం ప్రదర్శించారు. 'చిలకలూరిపేట ఏమైనా పాకిస్తాన్ లోఉందా? నేను ఇండియాలో నివసించడం లేదా? లోకల్ ఎవరు? నాన్ లోకల్ ఎవరు? నాయుడు కుప్పం నుంచి ఎన్నికలలో గెలిచి హైదరాబాద్ లో నివసిస్తుంటారు. వైఎస్ఆర్ కడప నుంచి ఎన్నికలలో గెలిచి హైదరాబాద్ లో ఉంటుంటారు. వారు స్థానికులా?' అని పోసాని విరుచుకుపడ్డారు.
ఆతరువాత ఆయన ఆగ్రహాన్ని చవి చూడడం స్థానిక నాయకుల వంతు అయింది. ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో 'అందుబాటులో' ఉంటారా అని ఒక స్థానిక నాయకుడు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానానికి ఎవరికీ నోట మాట రాలేదు. 'నేను తింటున్నప్పుడు, నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు, నేను నా స్క్రిప్టులు రాసుకుంటున్నప్పుడు తప్ప నా మొబైల్ లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను' అని పోసాని సమాధానం ఇచ్చారు. పోసాని తన ప్రచారంలో భాగంగా ఒక దళిత కాలనీలోకి వెళ్ళి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతున్న మహిళలను 'ఎంఎల్ఎలు, ఎంపిలు, సిఎంల భార్యలు మీ వలె పొదల మాటుకు వెళుతుండడం మీరు ఎప్పుడైనా చూశారా' అని అడిగారు. ఆయన మాటల తీరు నచ్చని మహిళలు గ్రామం నుంచి ఆయను తరిమివేసినట్లు తెలుస్తున్నది. మహిళల కోసం టాయిలెట్లు కట్టించగలనని వారికి వాగ్దానం చేయాలన్నది తన ఆంతర్యమని ఆయన ఆతరువాత వివరించారు. కాగా, పోసాని తత్వం మింగుడుపడక రాష్ట్ర యువరాజ్యం కార్యదర్శి కాసా రామ శ్రీను పార్టీకి రాజీనామాచేశారు.
News Posted: 15 April, 2009
|