ఆంధ్రులు ఇష్టమన్న కెసిఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆంధ్ర ప్రాంతంవారి శ్రేయస్సును కాంక్షిస్తున్నారా? మంగళవారం హైదరాబాద్ లో ఆయన అన్న మాటలను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది. మొదటి దశ ఎన్నికలకు తన ప్రచార కార్యక్రమం ముగింపు సందర్భంగా కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని మోతీనగర్ లో ఒక సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ, 'ఆంధ్ర ప్రాంతం వారంతా నాకు ఇష్టమైనవారే. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో స్థిరపడిన తెలంగాణేతరులకు టిఆర్ఎస్ వ్యతిరేకమేమీ కాదు' అని చెప్పారు.
ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడినవారి దృష్టిలో తాను మంచివాడినని అనిపించుకోవడానికి కెసిఆర్ ప్రయత్నించడంలో అర్థం లేకపోలేదు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని వోటర్లలో అత్యధిక సంఖ్యాకులు కోస్తా ప్రాంతం నుంచి నగరానికి వచ్చినవారే. ఈ సభలో పావుగంట సేపు ప్రసంగించిన కెసిఆర్ టిడిపి నాయకుడుగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సభ్యుడుగా తనకు ఆంధ్ర ప్రాంతం వారితో గల సన్నిహిత సంబంధాల గురించి ప్రస్తావించారు. 'టిఆర్ఎస్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం సాధన కోసం. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినవారు ఈ ప్రాంతం వదలి వెళ్ళాలని దానికి అర్థం కాదు. టిఆర్ఎస్ కు ఆంధ్ర ప్రాంతం వారంటే గౌరవం ఉంది. పార్టీ వారి మనోభావాలను ఎన్నడూ గాయపరచదు' అని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా తాను ఆంధ్ర ప్రాంతంవారిని ఆహ్వానించగలనని కూడా కెసిఆర్ చెప్పారు.
కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎం. సుదర్శనరావు కాగా కాంగ్రెస్ తరఫున వడ్డేపల్లి నరసింగరావు పోటీ చేస్తున్నారు. లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ (జెపి) కూడా ఈ నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. తాను కూడా ఆంధ్ర ప్రాంతం వాడినే కనుక ఈ ప్రాంతంలోని సెటిలర్లు తనకు అనుకూలంగా వోట్లు వేయగలరనే ఆశతో జెపి కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, లోక్ సత్తాకు వేసే వోట్లు నిరర్థకం కాగలవని కెసిఆర్ మంగళవారం తన రోడ్ షోలలో అన్నారు. ఆయన కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ముషీరాబాద్, ఉప్పల్ నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహించారు.
News Posted: 15 April, 2009
|