వోటర్లకు 'మహా' మిస్టరీ
హైదరాబాద్ : సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మహా కూటమి అభ్యర్థులు ఇద్దరు రంగంలో ఉండడం ఇటు తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కేడర్ లను, అటు వోటర్లను అయోమయంలోకి నెట్టుతున్నది. మహమూద్ అలీ టిఆర్ఎస్ అభ్యర్థి, మహా కూటమి అధికార అభ్యర్థి కాగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చార్టర్డ్ అకౌంటెంట్, వాణిజ్యవేత్త సుదీష్ రాంభొట్లను అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ ఇద్దరూ రంగంలో కొనసాగుతుండడం వల్ల మహా కూటమి వోట్లు చీలిపోయి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) లబ్ధి పొందే అవకాశం ఉంది. అసలు మహా కూటమి అభ్యర్థి నామినేషన్ వ్యవహారమే ప్రహసనప్రాయంలా మారింది. టిఆర్ఎస్ మొదట ఒక రియల్టర్ ఎస్. వెంకటరెడ్డిని నిలబెట్టింది. కాని తాను ఈ టిక్కెట్ కోసం రూ. 10 కోట్లను నాయకత్వానికి చెల్లించినట్లు వెంకటరెడ్డి వెల్లడి చేయడం వివాదానికి దారి తీయగా టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆయనను తొలగించి మహమూద్ అలీని అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే, టిఆర్ఎస్ అభ్యర్థి బలహీనుడని వాదిస్తూ చంద్రబాబు రాంభొట్లను ఎన్నికల రంగంలోకి దింపారు.
ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులూ రంగంలో ఉండడంతో టిడిపి పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ అభ్యర్థిని పట్టించుకోవడం లేదు. అదే విదంగా టిఆర్ఎస్ పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో రాంభొట్లకు ప్రోత్సాహం లభించడం లేదు. టిఆర్ఎస్ ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుండగా, టిడిపి ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో ఉంది. 'మేము రాంభొట్ల కోసం ప్రచారం చేస్తున్నాం' అని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కె. విజయరామారావు తెలియజేశారు. వాస్తవానికి ఆయన ప్రచార వాహనాలపై టిడిపి లోక్ సభ అభ్యర్థి ఫోటోలు ఉన్నాయి. మహా కూటమి అభ్యర్థులు ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకుని ఉంటే బాగుండేదని, అలా జరగలేదు కనుక టిడిపి రాంభొట్లకు మాత్రమే మద్దతు ఇస్తుందని విజయరామారావు పేర్కొన్నారు.
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి నాయని నరసింహారెడ్డి మాట్లాడుతూ, తన పార్టీ మహమూద్ అలీ విజయం కోసమే ప్రచారం చేస్తున్నదని తెలిపారు. 'టిఆర్ఎస్ ఆదేశానుసారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలీకి మద్దతు ఇస్తున్నారు. రాంభొట్లకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు' అని నాయని విస్పష్టంగా చెప్పారు. అయితే, మహా కూటమి అభ్యర్థులు ఇద్దరూ బరిలో ఉండడం రెండు పార్టీల కేడర్లలోను, వోటర్లలోను కూడా అయోమయం సృష్టిస్తున్నదని ఆయన చెప్పారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మహమూద్ అలీ తరఫున ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ మద్దతుదారుడు ఆర్. మహబూబ్ పాషా మాట్లాడుతూ, మహాకూటమి వోట్లు చీలిపోతాయని, టిఆర్ఎస్ వోట్లు మహమూద్ అలీకి, టిడిపి వోట్లు రాంభొట్లకు పడతాయని చెప్పారు. 'ఇది నిజంగా విచారకరం. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపికి చెప్పుకోదగిన బలం ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థి అధికారిక అభ్యర్థి కనుక టిడిపి వోట్లు మహమూద్ అలీకి పడాలి. కాని ఇప్పుడు అలా జరగడం అనుమానమే' అని పాషా పేర్కొన్నారు.వోటర్లు కూడా గందరగోళంలో చిక్కుకున్నారు. టిడిపి మద్దతుదారుడు, మారేడ్ పల్లి వాసి ఆర్. మధుకర్ రెడ్డి తాను ఎవరికి వోటు వేయాలో తెలియక తాను కొట్టుమిట్టాడుతున్నట్లు చెప్పారు. 'టిఆర్ఎస్ అభ్యర్థి అధికార అభ్యర్థి కాగా టిడిపికి బలం ఎక్కువ ఉంది. నేను ఇంకా నిర్ణయానికి రాలేదు. కాని ఎలా అయినా కూటమి వోట్లు చీలిపోతాయి' అని మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.
News Posted: 15 April, 2009
|