డ్వాక్రా పై పార్టీల శీతకన్ను
హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికలలో అందరూ గొప్పగా ప్రచారం చేసుకున్న మహిళల స్వయం సహాయక గ్రూపు (ఎస్ హెచ్ జి)ల గురించి ఈ దఫా ఏ పార్టీ కూడా ప్రస్తావన తీసుకురావడం లేదు. రాష్ట్రంలో డ్వాక్రా కింద మహిళల స్వయం సహాయక గ్రూపులకు అనుబంధితమైన మహిలలు కోటీ 25 లక్షల మంది ఉన్నారు. వారు ఏ ఎన్నికలలోనైనా కీలక పాత్ర పోషిస్తుంటారు. 2004 సార్వత్రిక ఎన్నికలలో ఆ మహిళా గ్రూపులను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడ్డాయి. తాము ప్రవేశపెట్టిన దీపం పథకం కారణంగా ఎస్ హెచ్ జిలను తమ పార్టీ సభ్యులుగా తెలుగు దేశం పార్టీ (టిడిపి) ప్రచారం చేసుకున్నది కూడా.
కాని ఆ మహిళా గ్రూపులు పది సంవత్సరాల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. సాలుకు మూడు శాతం వడ్డీ లేదా నెలకు నూటికి పావలా వడ్డీ రేటుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించగలమని కాంగ్రెస్ చేసిన వాగ్దానం వారిని ఆకట్టుకున్నది. పార్టీ బహిరంగ సభల వేదికలపై ఆ మహిళలను కాంగ్రెస్ అందరికీ పరిచయం చేసింది కూడా. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపి రెండూ ఆ మహిళా గ్రూపులను పట్టించుకోలేదు. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కూడా ఆ గ్రూపులన దూరంగా ఉంచాయి. డ్వాక్రా గ్రూపులు ఎన్నికల ర్యాలీలలో చురుకుగా పాల్గొంటుండడం గాని, పార్టీల తరఫున ప్రచారం చేస్తుండడం గాని కనిపించడం లేదు. ఎస్ హెచ్ జిల మద్దతును పొందగలమనే ధీమా ఉన్నందునే ఈ దఫా వాటి గురించి అంతగా మాట్లాడడం లేదని కాంగ్రెస్, టిడిపి ప్రతినిధులు చెప్పారు. 'ఎస్ హెచ్ జిలు తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. నగదు బదలీ పథకం బిపిఎల్ కుటుంబాలు, మధ్య తరగతి వారితో పాటు ప్రధానంగా ఆ మహిళా గ్రూపులకు ఉద్దేశించినదే. ఈ సారి కూడా వారు ఫలితాన్ని తేల్చగలరు. టిడిపి వారి తీర్పు వల్ల లబ్ధి పొందగలదు' అని టిడిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.
News Posted: 15 April, 2009
|