అత్యంత సంపన్న అభ్యర్థి
న్యూఢిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అత్యంత సంపన్న అభ్యర్ధిగా బిఎస్ పి కి చెందిన దీపక్ భరద్వాజ నిలిచారు. ఆయన గురువారంనాడు పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నామిషేన్ వేశారు. ఆ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో తనకు 600 కోట్లు ఆస్తులున్నట్లు ఆయన ప్రకటించారు. దాంతో దేశంలోనే అత్యంత సంపన్నుడైన లోక్ సభ అభ్యర్ధిగా ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 514 కోట్ల రూపాయల ఆస్తిగల అభ్యర్ధి ఖిమ్జీ పటాడియా సృష్టించిన రికార్డును అయన బద్దలు చేశారు.
దీపక్ భరద్వాజ పశ్చిమ ఢిల్లీ, రాంపురా ఎన్నికల కార్యాలయానికి తన పొలంలో పనిచేస్తున్న ట్రాక్టర్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాయావతి నాయకత్వంలోని బిఎస్ పి పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. రియల్ ఎస్టేట్స్, హోటళ్లు, విద్యాసంస్థలు ఇలా పలు రకాల వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. ద్వారకలో ఆయన ఒక స్కూలును నడుపుతున్నారు. ద్వారకలోను, పశ్చిమ ఢిల్లీ ధన్సాలోను మరో రెండు కార్పొరేట్ స్కూళ్లను ప్రారంభిచాలని ఆయన చూస్తున్నారు. పశ్చమ ఢిల్లీలోని లజ్వంతి గార్డెన్ నివాస అయిన భరద్వాజకు హర్దవార్ దీప్గంగాలో ఒక టౌన్ షిప్ ఉంది. ఢిల్లీ-గుర్ గాంవ్ ఎక్స్ ప్రెస్ హైవేలో ఆయనకు నితేష్ పుంజ్ హోటల్ కాంప్లెక్స్ అనే హోటల్ కూడా ఉంది.
క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా రికార్డు సృష్టించిన ముంబై వ్యాపారస్తుడు 53 ఏళ్ల ఖిమ్జీ పటాడియా సురేంద్రనగర్ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. 514 కోట్ల రూపాయల ఆస్తులు ఆభరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సంపాదించినట్లు ఆయన ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్ దాఖలు చేశారు. పటాడియాతో పాటు 299 కోట్ల రూపాయల ఆస్తులు గల విజయవాడ కాంగ్రెస్ అభ్యర్ధి రాజగోపాల్ ను, 150 కోట్ల రూపాయల ఆస్తులు గల దక్షిణ ఢిల్లీ బిఎస్ పి అభ్యర్ధి కరణ్ సింగ్ తన్వార్, ఆగ్నేయ ముంబై కి చెందిన 122 కోట్ల రూపాయలు ఆస్తులు గల సమాజ్ వాది పార్టీ అభ్యర్ధి అబు అజ్మీలను భరద్వాజ అధిగమించారు.
News Posted: 16 April, 2009
|