'నాలుగో ఫ్రంటుతో నష్టమే'
జాంగీపూర్ (పశ్చిమ బెంగాల్) : లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ తిరిగి ఇతర పార్టీల మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. సమాజ్ వాది పార్టీ (ఎస్ పి), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి), లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి)లతో కూడిన నాలుగవ ఫ్రంట్ సెక్యులర్ ఓట్లను చీల్చగలదని ప్రణబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీరియస్ అభ్యర్థులు లేని చోట్ల ప్రధాన అభ్యర్థుల ఓట్లను వారు దెబ్బ తీయగలరని ఆయన అన్నారు. 'వారు కచ్చితంగా ఓట్లను వ్యర్థం చేస్తారు. అదే వారి ప్రధాన ధ్యేయం' అని ప్రణబ్ ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వారి మద్దతు స్వీకరించవచ్చునని సూచిస్తూ వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించవలసిందని కోరినప్పుడు, 'నాకు తెలియదు. అది సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంతా అంకెల క్రీడ కదా. మాకు తగినన్ని సీట్లు రాగలవని మాత్రమే నేను చెప్పగలను. నేను జోస్యం చెప్పజాలను. మేము గెలవడానికే ఎన్నికలలో పోటీ చేస్తున్నాం' అని ప్రణబ్ సమాధానం ఇచ్చారు.
'మాతో సీట్ల పంపకం ఒప్పందాలు ఉన్న పార్టీలతో కలసి తగినన్ని సీట్లు గెలుచుకోవడానికి తగిన సంఖ్యలో నియోజకవర్గాలలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. అందువల్ల ప్రభుత్వ స్థాపనకు కావలసిన మెజారిటీని కాంగ్రెస్ సంపాదించడం కష్టమేమీ కాబోదు' అని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తోను, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి)తోను, తమిళనాడులో డిఎంకెతోను, జార్ఖండ్ లో శిబు సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)తోను కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్న విషయం విదితమే.
News Posted: 16 April, 2009
|