ఇస్రో నిఘా శాటిలైట్
చెన్నై: ఇస్రో సంస్థ సోమవారంనాడు ప్రయోగిస్తున్న నిఘా ఉపగ్రహంతో భారత రక్షణ దళాల నిఘా సామర్ద్యం గణనీయంగా పెరిగిపోనుంది.ఈ ఉపగ్రహానికి ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా పొగ మంచు గుండా, మేఘాల గుండా భూ ఉపరితల వస్తువులను చూడగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మక ఉపగ్రహ వాహక నౌక పిఎస్ఎల్ వి ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ నిఘా ఉపగ్రహాన్ని రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (RISAT) అని పిలుస్తారు.
రీశాట్ తో పాటు అన్నా యూనివర్శిటీ రూపొందించిన 'అనుశాట్' అనే మైక్రో ఎడ్యుకేషనల్ శాటిలైట్ ను కూడా ప్రయాగిస్తున్నారు. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 6-30 నుండి 7 గంటల మధ్యకాలంలో ప్రయోగిస్తారు. 230 టన్నుల పిఎస్ఎల్ వి రాకెట్ 300 కెజిల రిశాట్, 50 కెజిల అనుశాట్ లతో సహా 350 కెజిల పేలోడ్ ను మోసుకెళుతుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఈ రాకెట్ 50 కెజిల అనుశాట్ ను భూ కింది కక్ష్యలో ప్రవేశపెడితే, రిశాట్ ను భూ ఉపరితలానికి 560 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్ష్యలో ప్రవేశ పెడుతుంది. ఏర్పాట్లన్ని సజావుగా సాగుతున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. రాకెట్ ప్రయోగానికి 48 గంటల ముందు నుండి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని వారు తెలిపారు.
వాతావరణ పరిస్థితులన్నిటిని తట్టుకుని పనిచేసే శాటిలైట్ గా ఇస్రో ఖాయం చేసినప్పటికీ, ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) పరికారాన్ని ఈ శాటిలైట్ లో అమర్చడం వలన ఇది రక్షణ సంబధిత సామర్ధ్యాన్ని సంతరించుకుంది. ఇజ్రాయిల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఎస్) ఈ పరికరాన్ని రూపొందించింది. ఇస్రోకు చెందిన ఏ ఉపగ్రహంలోను ఇలాంటి పరికరాలను అమర్చలేదు. ఇస్రో సొంతంగా ఎస్ఏఆర్ పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. దాంతో ఇంతకంటే పెద్ద ఉపగ్రహంలో దీన్ని అమర్చాలన్న లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది. జనవరిలో ఇజ్రాయిల్ కు సంబంధించిన టెక్ సార్ నిఘా ఉపగ్రహాన్ని శ్రీహరికోట-సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించడం జరిగింది. భారతీయ విద్యా సంస్థ అనుశాట్ అనే ఒక ఉపగ్రహాన్ని రూపొందించడం ఇదే ప్రథమం. కరువు, వ్యర్ధ భూముల పర్యవేక్షణకు, పట్టణ ప్రణాళిక, మరి ఇతర అధ్యయనాలకు ఈ ఉపగ్రహం ఉపకరిస్తుంది. ఇది పిఎస్ఎల్ వి రాకెట్ 15వ ప్రయోగంగా ఇస్రో అధికారులు తెలియజేశారు.
News Posted: 16 April, 2009
|