హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన ఏడాది తరువాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఓటర్లు ఆ పునర్విభజనపై ఆక్షేపణలు తెలియజేశారు. ఇందుకు నిరసన సూచకంగా తాము ఓట్లు వేయబోమని వారు భీష్మించుకున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యాకులు తమ పూర్వపు నియోజకవర్గాలనే ఇప్పటికీ ఇష్టపడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో సింగరేణి మండలంలోని టేకులగూడెం గ్రామ ప్రజలు పోలింగ్ లో పాల్గొనలేదు. రాష్ట్రంలో సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంఎల్ఎ గుమ్మడి నరసయ్య స్వగ్రామం ఇది. ఈ గ్రామం ఇంతకు ముందు ఈ విప్లవ పార్టీకి కంచుకోటగా భావించే ఇల్లెందు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నరసయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు. టేకులగూడెం గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని వైరా నియోజకవర్గంలోకి మార్చడం పట్ల నిరసన ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు.
వరంగల్ జిల్లాలోని సీతారామపురం గ్రామ వాసులు కూడా పునర్విభజనలో చేసిన మార్పుల పట్ల నిరసన సూచకంగా ఓటింగ్ లో పాల్గొనలేదు. పునర్విభజన ప్రక్రియలో మండలాలను ఒక సెగ్మెంట్ నుంచి మరొక సెగ్మెంట్ కు మార్చడంలో పారదర్శకత లోపించిందనే అనుమానాలు ఈ నిరసనలతో వ్యక్తమవుతున్నాయి.