'పెద్ద మంత్రి'కి గట్టి పోటీ
తాడిపత్రి : అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ వర్గాలు 'పెద్ద మంత్రి' అని పేర్కొనే రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకరరెడ్డి బహుశా తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పోటీని ఈ దఫా ఎన్నికలలో ఎదుర్కొంటున్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), లోక్ సత్తా పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం 15 మంది తాడిపత్రి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అయితే, దివాకరరెడ్డి ప్రదానంగా తన పాత ప్రత్యర్థి, తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి చెందిన పేరం నాగిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి చెందిన పైలా నరసింహయ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.1983లో తొలిసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత దివాకరరెడ్డి ఎన్ని ఆటుపోట్లకు గురైనా పరాజయం మాత్రం చవి చూడలేదు.
తాడిపత్రిలోను, పరిసర ప్రాంతాలలోను సున్నపురాయి, గ్రానైట్ వంటి ఖనిజ వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కావడం మినహా ఈ సెగ్మెంట్ లో చెప్పుకోదగిన అభివృద్ధి ఏమీ జరగలేదు. అయితే, 2005 నుంచి పిఎబిఆర్ రెండవ దశ (యాడికి బ్రాంచ్ కాలువ), చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లు, జె.సి. నాగిరెడ్డి మంచినీటి ప్రాజెక్టు వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారు. అవి ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.నడి వేసవిలో కూడా రోజుకు రెండుసార్లు మంచి నీటిని సరఫరా చేస్తున్న పట్టణం రాష్ట్రంలో బహుశా తాడిపత్రి కావచ్చు. మంత్రి తమ్ముడు జె.సి. ప్రభాకరరెడ్డి చూపుతున్న ప్రత్యేక ఆసక్తి ఫలితంగా గడచిన ఐదు సంవత్సరాలలో తాడిపత్రి గణనీయంగా అభివృద్ధి చెందింది.
అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నప్పటికీ 2006లో పట్టణంలో ఒక ప్రార్థనా స్థలంలో కొద్ది భాగాన్ని తొలగింపునకు దారి తీసిన రోడ్డు వెడల్పు కార్యక్రమం అనంతరం ఒక ప్రధాన వర్గంవారు దూరం కావడం దివాకరరెడ్డిని కలవరపరుస్తున్నది.ఇక టిడిపి అభ్యర్థి నాగిరెడ్డి మూడు సార్లు ఓడిపోవడం, దివాకరరెడ్డి బలం కొంత మేరకు తగ్గిపోవడం అవకాశంగా తీసుకుని జనం నమ్మకాన్ని చూరగొనాలని ఆశిస్తున్నారు. 'కలర్ టివిలు, నగదు బదలీ పథకాలు నా అవకాశాలను కచ్చితంగా పెంచగలవు' అని నాగిరెడ్డి చెప్పారు. కాగా, ప్రజారాజ్యం అభ్యర్థి నరసింహయ్య పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పేరు ప్రతిష్ఠలు, యువకులు, రెండు కులాల మద్దతుపై ఆధారపడుతున్నారు.
News Posted: 19 April, 2009
|