ఏ పార్టీకీ బలం లేని సీటు
గుత్తి : అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పెద్ద రైల్వే కూడలి. ఇది పాపులర్ వాణిజ్య కేంద్రం కూడా. సినిమా పంపిణీ సంస్థలకు, ఫైనాన్స్ సంస్థలకు కూడా ప్రసిద్ధి చెందింది గుంతకల్లు. అయితే, ఈ నియోజకవర్గానికీ సమస్యలు లేకపోలేదు. చలనచిత్ర పరి8మలో మాంద్యం కారణంగా పలు పంపిణీ సంస్థలు మూతపడ్డాయి. గుంతకల్లు రైల్వే డివిజన్ ను కుదించారు. పట్టణంలోని అతి పెద్ద ఆంధ్ర సహకార నూలు మిల్లు ట్రేడ్ యూనియన్ సమస్య కారణంగా మూతపడింది. అదే విధంగా కార్మికుల అలజడి పర్యవసానంగా రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. రైతులు చాలా కాలంగా తమ పొలాలకు నీటి సరఫరాను కోరుతున్నారు. కాని ఈ సమస్యను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.1991లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గుంతకల్లు బైపాస్ చానెల్ కు శంకుస్థాపన చేశారు. కాని అది ఇప్పటి వరకు అదే స్థితిలో ఉండిపోయింది.
1955లో ఏర్పడిన గుంతకల్లు నియోజకవర్గం పరిధిలో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలు ఉన్నాయి. 1955లో ఇది ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గంగా ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు రాజారామ్, ఎస్. నారాయణప్ప గెలుపొందారు. 1962లో ఈ స్థానంలో సిపిఐ అభ్యర్థి వి.కె. ఆదినారాయణరెడ్డి, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆర్. రామచంద్రగౌడ్, 1972లో మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి డి.కె. వెంకటరెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి కె. వెంకటరామయ్య గెలుపొందారు.
1983లో ప్రముఖ వాణిజ్యవేత్త పత్తి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీ (టిడిపి) టిక్కెట్ పై గెలిచారు. కాంగ్రెస్ నుంచి గాదె లింగప్ప 1985లోను, ఎ. జగదీష్ 1989లోను ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు.1994లో గాదె లింగప్ప టిడిపి టిక్కెట్ పై గెలుపొందగా 1999లో సాయినాథ్ గౌడ్ టిడిపి టిక్కెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. గాదె లింగప్ప మరణానంతరం 2004లో ఆయన కుమార్తె ఎన్. నీలావతి ఈ సీటును గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రముఖ వాణిజ్యవేత్త కె. మధుసూదన్ గుప్తా కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా టిడిపి నుంచి సాయినాథ్ గౌడ్, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నుంచి పత్తి రవి కుమార్ పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అనంతపురం లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగారు. దీనితో కాంగ్రెస్ అభ్యర్థికి ఉపశమనం లభించింది. గుంతకల్లు శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.4 లక్షల మంది పురుషులు.
News Posted: 19 April, 2009
|