ఫుడ్ ప్యాకెట్ విసిరారు
పానాజి : సభికులు విసిరే 'ఆయుధాల'ను తప్పించుకున్న రాజకీయ నాయకుల జాబితాలో తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శాంతారామ్ నాయక్ చోటు సంపాదించుకున్నారు. శనివారం సాయంత్రం బాగా పొద్దుపోయిన తరువాత దక్షిణ గోవాలోని ఒక పట్టణంలో ఒక ఎన్నికల ర్యాలీకి హాజరైన జనంలో నుంచి ఒకరు శాంతారామ్ నాయక్ వైపు ఒక ఆహారం ప్యాకెట్ ను విసిరారు. కాని అది లక్ష్యాన్ని కొద్దిలో 'మిస్' అయింది.
దక్షిణ గోవాకు చెందిన నాయక్ పానాజీకి 60 కిలో మీటర్ల దూరంలోని గని పట్టణం కుర్చోరెమ్ లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు రామ దేశాయి అనే కాంగ్రెస్ కార్యకర్త బిర్యానీ ప్యాకెట్ ను ఆయనపైకి విసిరాడు. రామ దేశాయి విలేఖరుల విభాగంలో కూర్చుని కనిపించాడు. కాగా ఆ ప్యాకెట్ కార్యకర్తలకు పంచిన బిర్యానీ ప్యాకెట్లలోది. నాయక్ వైపు దేశాయి ప్యాకెట్ విసురుతూ, 'తుమ్ హీ సోగ్లె ఫత్తింగ్ (మీరంతా అబద్ధాలకోరులు)' అని అరిచాడు. ఈ సంఘటన అనంతరం పోలీసులు దేశాయిని అక్కడి నుంచి తీసుకుపోయారు. వారు ఆతరువాత అతనిపై భారతీయ శిక్షా స్మృతి (ఐఫిసి)లోని 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
గోవాకు చెందిన ఏకైక రాజ్యసభ సభ్యుడు శాంతారామ్ నాయక్ ఆతరువాత విలేఖరులతో మాట్లాడుతూ, తాను ఈ విషయమై విచారణ చేయవలసిందిగా మాత్రమే పోలీసులన కోరానని, దేశాయిపై లాంఛనంగా ఫిర్యాదు ఏదీ దాఖలు చేయలేదని చెప్పారు. ఆ 'దుండగుని'తో పరిచయం ఉన్నదా అనే ప్రశ్నకు నాయక్ సమాధానం ఇస్తూ, 'ఆ వ్యక్తి ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించాడు. వేరే కార్యక్రమాలతో బిజీగా ఉన్న కారణంగా నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను' అని చెప్పారు. ఇటీవలి కాలంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ వంటి సీనియర్ రాజకీయ నాయకులు సభికుల నుంచి ఇటువంటి దాడులకు గురైన విషయం విదితమే.
News Posted: 19 April, 2009
|