పాలకొల్లు పరవశిస్తోంది!
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి ఓ విశిష్ట చరిత్ర ఉంది. ఆ రోజుల్లోనే పాలకొల్లు వాస్తవ్యులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. విలువైన ఆస్తులను స్వాతంత్ర్య ఉద్యమం కోసం త్యాగం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత పాలకొల్లు ప్రముఖ వ్యాపార కేంద్రంగా రూపొందింది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టణంగా, చుట్టూ పచ్చని చేలతో ప్రశాంతమైన వాతావరణానికి నిలయంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పుణ్యమా అని మరో విశిష్టతను సంతరిచుకోనుంది. ఎన్నికల్లో చిరంజీవి విజయం ఖాయమని భావిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం ప్రజలు, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి తొలిసారిగా ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ఆనందం పట్టలేకపోతున్నారు.
ప్రజారాజ్యం అధినేత ఈ నెల 3వ తేదీన ఇక్కడ నామినేషన్ వేసిన తరువాత ఇతర ప్రాంతాల్లో ప్రచారం కోసం పర్యటనలు జరుపుతున్నారు. ఆయన తరఫున భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మేనల్లుడు అర్జున్, ఇతర బంధువులు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చిరంజీవి కూడా ఆదివారం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. అంతే కాకుండా వివిధ టివి చానెళ్లు జరుపుతున్న సర్వేలలో కూడా ఇక్కడి ఓటర్లు, ముఖ్యంగా యువజనులు, మహిళలు ప్రజారాజ్యానికే తమ ఓటనీ, చిరంజీవే కాబోయే ముఖ్యమంత్రి అనీ స్పష్టంగా చెబుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం లభిస్తుండడం పట్ల చిరంజీవి రోడ్ షోలకు హాజరయ్యే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 20 April, 2009
|