చిరు పార్టీ డైలమా
హైదరాబాద్ : రెండు శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి ఆ రెండింటినీ గెలుచుకున్నట్లయితే ఏది అట్టిపెట్టుకుంటారనే ప్రశ్నను ప్రత్యర్థి పార్టీలు అదేపనిగా అడిగి ఇరకాటంలోకి నెట్టుతుండడంతో పిఆర్పీ నాయకులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకులు కొన్ని రోజులుగా తిరుపతిలో కలియతిరుగుతూ చిరంజీవి పాలకొల్లును అట్టిపెట్టుకుంటారని చెపుతున్నారు. పాలకొల్లులో వారు సరిగ్గా అందుకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. తిరుపతి, పాలకొల్లు ఓటర్లను నిరాశ, అసంతృప్తి తప్పదని సూచించడం ద్వారా వారిని చిరంజీవికి వ్యతిరేకులుగా మార్చడమే ఆ పార్టీల వ్యూహంగా కనిపిస్తున్నది.
కాగా, ప్రత్యర్థుల కుయుక్తి ఇది అని ఓటర్లకు నచ్చజెప్పడానికి పిఆర్పీ నాయకులు బాగా శ్రమ పడుతున్నారు. రెండు నియోజకవర్గాలలో విజయం సాధించినట్లయితే, ఏది అట్టిపెట్టుకోవాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ విషయమై ఓటర్లు ఆందోళన చెందవలసిన పనిలేదని వారు అంటున్నారు.
News Posted: 20 April, 2009
|