అప్పుడే 'బాబుల' వలసలు!
హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలు ముగియడం అధికార యంత్రాంగంలో కదలికలకు దారి తీస్తున్నట్లున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సూచిస్తున్న అనధికారిక ఎగ్జిట్ పోల్స్ ను, రాజకీయ పార్టీల క్లెయిములను విశ్వసించవచ్చా కూడదా అనే విషయాన్ని అలా ఉంచితే వాటిని అనేక మంది సీనియర్ అధికారులు (బాబులు) విశ్వసిస్తూ తమ తమ ప్రయత్నాలను అప్పుడే ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయడానికి కనీసం 20 మంది సీనియర్ అధికారులు సంసిద్ధం అవుతున్నట్లు వినికిడి. వారిలో కనీసం ఇద్దరు అధికారులు తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడును కలుసుకుని, మొదటి దశలో మహా కూటమి 'అద్భుత' ప్రదర్శనకు ఆయనను అభినందించినట్లు తెలుస్తున్నది.
న్యూఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న కొద్ది మంది అధికారులు కూడా తమకు సముచిత పోస్టులు ఇచ్చినట్లయితే రాష్ట్రానికి తిరిగి రావడానికి తాము విముఖులం కామని సూచించినట్లు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతానికి గుంభనగానే ఉండి ఎవరు అధికారంలోకి వస్తారో తెలిసిన తరువాతే కొత్త 'బాస్'ల పట్ల అణకువగా ఉండవచ్చునని భావిస్తున్న ఆఫీసర్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వివిధ జిల్లాలలో కూడా ఇదేవిధంగా బదలీల కోసం ప్రభుత్వ అధికారులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారని కూడా తెలుస్తున్నది.
News Posted: 20 April, 2009
|