కెసిఆర్ కు కూటమి చేయి?
హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు ముగిశాక తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో ప్రచారం సాగిస్తుండగా, తెలుగుదేశం నాయకులు మాత్రం టిఆరెస్ తో తమకు ఎలాంటి సంబధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మహాకూటమి తరఫున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పుడు, మహాకూటమి సభ నిర్వహించినప్పుడు కెసిఆర్ ను ఆహ్వానించలేదు. ముఖ్యమంత్ర రాశేఖరరెడ్డి కూడా ఇదే విషయాన్ని తన ప్రసంగాల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. 'ప్రకటనల్లో మహాకూటమి నాయకుల ఫోటోలు ప్రచురిస్తున్నారు, కెసిఆర్ ఫోటో తప్ప. ఆయన కూటమిలో ఉన్నట్టా, లేనట్టా?' అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే, 'ఎవరి ఫోటో అవసరమైతే వారివి వేసుకుంటాం, మధ్యలో మీకెందుకు? అయినా ఇది ముఖ్యమంత్రి పట్టించుకోవలసిన వ్యవహారమా?' అని తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు జవాబిచ్చారు.
చివరకు మహాకూటమి తరఫున ఎన్నికల కమిషన్ ను కలిసే బృందంలో కూడా కెసిఆర్ లేకపోవడం గురించి ఎదురయ్యే ప్రశ్నలకు తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పలేక పోతున్నారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కెసిఆర్ మొదట్లో ముచ్చటపడ్డారు. అయితే ముఖ్యమత్రి ఎత్తుగడను అర్ధం చేసుకున్న తెలుగుదేశం నాయకులు కెసిఆర్ ను ప్రస్తుతం ప్రచారానికి దూరంగా ఉంచడమే మంచదని భావిస్తున్నారు. సుస్థిర ప్రబుత్వం కోసం తెలుగుదేశం పార్టీకే ఓటు వేయండని చంద్రబాబు చెప్పడం ద్వారా, టిఆరెస్ అవసరం లేకుండానే, తమకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఇవ్వండని కోరుతున్నారు. అంతే కాదు, జిల్లాల వారీగా తెలుగుదేశం నాయకులకు ఫోన్ చేసి సొంత బలంతో అధికారంలోకి వచ్చేలా అవసరమైనన్ని సీట్లు గెలుచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాలను ముందుగానే ఊహించిన టిఆరెస్ రాష్ట్రంలో ఏ పార్టీకి సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని, టిఆరెస్ మద్దతు కీలకమవుతుందని టిఆరెస్ అధ్యక్షుడు కెసిఆర్ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. టిఆరెస్ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదని నాయకులు తెలిపారు.
News Posted: 21 April, 2009
|