పోస్టల్ బ్యాలట్లపై కన్ను
కడప : రెండవ దశ ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు వంటి నియోజకవర్గాలలో పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉండవచ్చునని, ఏ అభ్యర్థి గెలిచినా ఆధిక్యం తక్కువగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తుండడంతో అభ్యర్థులు, వారి పార్టీలు పోస్టల్ బ్యాలట్లను కైవసం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తున్నది.
1994లో మైదుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎల్. రవీంద్రా రెడ్డికి ఆయన సమీప ప్రత్యర్థి ఎస్. రఘురామిరెడ్డి కన్నా కేవలం 27 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 1999 ఎన్నికలలో పి. రామసుబ్బారెడ్డి తన సమీప ప్రత్యర్థి సి. నారాయణరెడ్డి కన్నా 350 ఓట్లు మాత్రమే అధికంగా రాబట్టగలిగారు.
లోగడ ఎన్నికలలో పోటీ రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు ముక్కోణపు పోటీ జరుగుతుండడంతో విజేతల ఆధిక్యం మరింత తగ్గవచ్చు. ఇటువంటి పరిస్థితులలో పోస్టల్ బ్యాలట్లు కీలకం అవుతున్నాయి. ఈ విషయం గ్రహించిన అన్ని పార్టీలూ ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆకట్టుకోవడంలో నిమగ్నమయ్యాయి. వారు మాత్రమే పోస్టల్ బ్యాలట్ వేయడానికి అర్హులు. అంతేకాకుండా వారు నిర్ణయాత్మక శక్తులు కాగలరు. ఈ విషయంలో యూనియన్ నాయకులు, ఎన్ జిఓల సాయాన్ని పార్టీలు కోరుతున్నాయి.
కడప జిల్లా అధికార యంత్రాంగం సమాచారం ప్రకారం, 14 వేల మంది ఉద్యోగులను ఎన్నికల విధులలో నియమించారు. వారందరూ పోస్టల్ బ్యాలట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఆ ఉద్యోగులపై దృష్టి నిలిపాయి.
News Posted: 21 April, 2009
|