వాస్తవ లోకంలో పిఆర్పీ
హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలలో తమ బలం ఎంతటిదో తెలుసుకున్న ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి ఎన్నికల వాస్తవాలు గ్రహింపునకు వస్తున్నాయి. పెక్కు నియోజకవర్గాలలో ధన బలానిదే పైచేయి అయిందని, తమ అభ్యర్థులు దానికి సరితూగలేకపోయారని పార్టీ నాయకులు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు.
మొదటి దశ పోలింగ్ అనంతరం తమ తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ (టిడిపి), కాంగ్రెస్ అభ్యర్థుల పరంగా జరిగిన వ్యయం చూసి తమకు దిమ్మ తిరిగిపోయిందని తెలియజేస్తూ నివేదికలు సమర్పిస్తున్నారు. రెండవ దశలో అవకాశాల గురించి పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.
కిమిడి కళా వెంకటరావు, తమ్మినేని సీతారామ్ వంటి ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకులు కూడా పోలింగ్ చివరి గంటలలో డబ్బు పంచవలసి వచ్చిందనే వార్తలు నిష్కళంక రాజకీయాలకు, సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీలో ఆందోళన కలిగిస్తున్నది.
తమకు తగినంతగా నిధులు సమకూర్చని కారణంగా తాము ఓటర్లను ప్రభావితం చేయలేకపోయామని తెలంగాణలో పార్టీ అభ్యర్థులు చాలా మంది ఫిర్యాదు చేశారు. పలు నియోజకవర్గాలలో చిరంజీవి వీరాభిమానులు డబ్బు కోసం అభ్యర్థులను అడిగినట్లు తెలుస్తున్నది.
అయితే, తమకు పోలైన ఓట్లన్నీ పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి గల ఆకర్షణ శక్తి పుణ్యమేనని అభ్యర్థులు అంగీకరించారు. చిరంజీవిపై గల వీరాభిమానంతోనే యువజనులు, మహిళలు తమకు ఓట్లు వేశారని వారు తెలిపారు.
రెండవ దశ పోలింగ్ కు రెండు రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో వ్యూహం మార్చాలని పార్టీ నాయకులు యోచిస్తున్నారు. సంపన్నులైన అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయని వారు దృఢనమ్మకంతో ఉన్నారు. చిరు ఆకర్షణ శక్తి, ధనబలం కలగలిస్తే మంచిదని వారు భావిస్తున్నారు. అంత నమ్మకాన్ని వ్యక్తం చేయలేని నాయకులూ లేకపోలేదు. టిడిపి, కాంగ్రెస్ ధన బలాన్ని ఎదుర్కోవడం కష్టమని వీరు భావిస్తున్నారు.
News Posted: 21 April, 2009
|