నేతల్లో ప్రచారం అలసట
హైదరాబాద్ : మండే ఎండలు, ఉధృతంగా సాగించిన ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నాయకులపైన, అభ్యర్థులపైన తీవ్ర ప్రభావం చూపాయి. వారిలో చాలా మంది వడదెబ్బకు, శారీరక బాధలకు గురయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు కాళ్ళు తీపులు పెడుతున్నాయి. తదుపరి దశకు సిద్ధమయ్యే ముందు ఒకటి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారు. 'ప్రచార సమయంలో అదేపనిగా నిలబడి ఉండడం వల్ల కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నొప్పి కారణంగా నాకు నిలబడడం కూడా కష్టంగా ఉంటున్నది' అని కెసిఆర్ చెప్పారు.
కెసిఆర్ తో పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ మొహాల్లో కూడా బాగా అలసట కనిపిస్తున్నది. ఎన్నికల వేడి వారిపై ప్రభావం చూపినట్లున్నది.
వడదెబ్బ తగిలిన కారణంగాను, ఒక సభలో తాను నిలబడిన వేదిక కూలిపడినప్పుడు స్వల్పంగా గాయపడిన కారణంగాను పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
అయితే, తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సంరంభం ముగిసినందున టిఆర్ఎస్ నాయకులు ప్రచారం కోసం ఇక శ్రమపడవలసిన అగత్యం లేదు. కాని కాంగ్రెస్, టిడిపి, పిఆర్పీ నాయకులకు ఆ శ్రమ తప్పదు. ఈ మూడు పార్టీలు మొదటి దశ అభ్యర్థులకు రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో రెండవ దశ ఎన్నికలలో తమ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాయి.
News Posted: 21 April, 2009
|