కెసిఆర్ కొత్త ఎత్తుగడ!
హైదరాబాద్ : ఎన్నికలకు ముందు పార్టీలో అసమ్మతిని చవిచూసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకున్నది. హంగ్ శాసనసభ ఏర్పడవచ్చుననే సూచనలు వస్తున్న నేపథ్యంలో తమ సభ్యులనందరినీ కలిపి ఉంచడం, ఫిరాయింపులను నిరోధించడం ఎలా అనేది ఆయనకు అంతుపట్టడం లేదు.
తెలంగాణలో 45 శాసనసభా నియోజకవర్గాలు, ఎనిమిది లోక్ సభా నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులను అందరినీ కలిపి ఉంచడానికి కెసిఆర్ తో పాటు వారందరూ మే మొదటి వారంలో ఉత్తరాదికి 'విహార యాత్ర'కు బయలుదేరి వెళతారు. ఇతర పార్టీలకు వారు అందుబాటులో లేకుండా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. అయితే, పర్యటన కార్యక్రమాన్ని ఇంకా ఖరారు చేయవలసి ఉంది. కాని ఎవరికీ ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండా చూడడానికి కెసిఆర్ తెలంగాణ భవన్ లో ఒక వారం పాటు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం విజేతలైన అభ్యర్థులు అందరూ శిబిరానికి 'హాజరై' తీరాలి.
అయితే, ఫిరాయింపులు టిఆర్ఎస్ కు కొత్తేమీ కాదు. 2004 ఎన్నికలలో గెలిచిన 26 మంది శాసనసభ్యులలో తొమ్మిది మంది పార్టీలో కెసిఆర్ 'నిరంకుశ' పాలనను నిరసిస్తూ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం విదితమే. అంతేకాదు. గత అసెంబ్లీలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన కొందరు ఎంఎల్ఎల నుంచి అసమ్మతిని ఎదుర్కోవలసి వచ్చింది. దానితో తెలివి వచ్చిన కెసిఆర్ అభ్యర్థులు గెలిచే లోపలే వారు లేవనెత్తిన సమస్యలన్నిటినీ పరిష్కరించి తాజా ఫిరాయింపులను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిపై నిఘా వేసి ఉంచగలరని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు సూచించారు.
వాస్తవానికి ఈ నెల 16న మొదటి దశ ఎన్నికలు ముగిసిన అనంతరం కెసిఆర్ అభ్యర్థులందరితో టెలికాన్ఫరెన్స్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఒక సమావేశానికి హాజరు కావలసిందిగా కూడా వారిని ఆయన కోరారు.
News Posted: 22 April, 2009
|