సచిన్ ఎవర్ గ్రీన్!
ముంబాయి: ఏ యేడాదికా యేడు సచిన్ టెండుల్కర్ పుట్టినరోజు జరుపుకున్నప్పుడల్లా అతడింకా ఎన్నాళ్లు అంతర్జాతీయ పోటీ్ల్లో ఆడతాడని సందేహాలు వ్యక్తమవుతూనే వున్నాయి. అయితే, ఏప్రిల్ 24తో ముప్ఫయ్యారేళ్లు నిండిన సచిన్ ఇటీవల న్యూజిలాండ్ లోను, ఇప్పుడు ఐపిఎల్ టోర్నీలోను బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే మరి కొన్నేళ్ల వరకూ అతడు బ్యాటింగు మాస్టరే అనిపిస్తోంది. ఇండియ3 మాజీ కెప్టెన్ నారీ కంట్రాక్టర్(75) ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ, 2011 వరల్డ్ కప్ ను ఇండియా కైవసం చేయడంలో అతడే కీలక పాత్ర పోషిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. '2007 ప్రపంచకప్ పోటీల నాకౌట్ రౌండ్ లో భారతజట్టు తిరుగుముఖం పట్టాక, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు ఇక రిటైరైతే మంచిదా, కాదా? అని ఒక న్యూస్ చానెల్ లో జరిగిన చర్చ సందర్భంగా, 2011 వరల్డ్ కప్ లో ఆడగల ప్రతిభావంతుడు ఒక్క టెడుల్కరేనని నేను చెప్పాను. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నాను' అని శుక్రవారం టెండుల్కర్ రెస్టారెంట్ లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కాంట్రాక్టర్ చెప్పాడు.
'ఇఫ్ క్రికెట్ ఈజ్ ఎ రెలిజియన్, సచిన్ ఈజ్ ఎ గాడ్'(క్రికెట్ ఒక మతం అయితే, టెండుల్కర్ దేవుడు)అనే శీర్షికతో విజయ్ సంతానం, శ్యాం బాలసుబ్రమణియం రచించిన పుస్తకం శుక్రవారం టెండుల్కర్ రెస్టారెంట్ లో విడుదలయింది. ఈ కార్యక్రమంలోనే నారీ కంట్రాక్టర్ పైన పేర్కొన్న వ్యాఖ్య చేసి సచిన్ ను అభినందనలతో ముంచెత్తాడు. 'సచిన్ ఇదే ఫిట్ నెస్ తో ఉంటే, ఆ లోగా ఏ విధంగానూ గాయపడకుండా ఉంటే వచ్చే వరల్డ్ కప్ పోటీల్లో ఆడతాడనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే అతడు గాయపడకుండా జాగ్రత్తవహించాలి. ఎందుకంటే ఈ వయసులో గాయపడితే కోలుకోడానికి ఎక్కువ వ్యవధి పడుతుంది. అతడికి ఎదురయ్యే ప్రమాదం అదొక్కటే. అంతే కాని ఏ బౌలరూ అతడినేమీ చేయలేడు' అని కాట్రాక్టర్ అభిప్రాయపడ్డాడు.
టెస్ట్ క్రికెట్ లో అతి చిన్న వయసులో పదివేల పరుగులను అధిగమించడం డాన్ బ్రాడ్ మన్ కు కూడా సాధ్యం కాలేదు. అయితే భారతజట్టు కెప్టెన్ గా సచిన్ కు తగినంత మద్దతు లభించలేదు. అతడికి గల అంకితభావం, అనుభవం, కార్యదీక్షా తత్పరత, అనుభవం, నైపుణ్యం, సామర్ధ్యం మరొకరిలో కనిపించవు. శుక్రవారం విడుదలైన పుస్తకంలో సచిన్ టెండుల్కర్ అసాధారణ జీవిత కథ, క్రికెట్ లో అతడు అధిరోహించిన ఉన్నత శిఖరాలు, సాధించిన ఘన కార్యాలు, అందుకున్న అవార్డులు తదితర వివరాలన్నింటినీ పొందుపరిచారు. 'క్రికెట్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం ఇది' కాంట్రాక్టర్ ప్రశంసించాడు.
News Posted: 25 April, 2009
|