నిద్రకు ప్రియాంక దూరం
లక్నో : ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలను తప్పించుకోజూడడం, విమర్శలను తోసిరాజనడం దేశంలో ఎంతో పేరున్న రాజకీయ కుటుంబానికి అలవాటైన పద్ధతి కావచ్చునేమో గాని మండే ఎండల కారణంగా ఓటర్లు వెనుకాడడంతో పోలింగ్ శాతం పడిపోవడం వారికి పెద్ద నష్టమే కాగలదు. రాజకీయ వారసుడు రాహుల్ గాంధి ఎన్నికల ప్రచార నిర్వాహకురాలు, సోదరి ప్రియాంక వాద్రా గురువారం అమేథిలో పోలింగ్ బాగా తక్కువగా నమోదు కావడం తనకు నిద్రలేని రాత్రిని చేసిందని ఒప్పుకున్నారు. దీనితో తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి నియోజకవర్గం రాయబరేలిలో తన కృషిని రెట్టింపు చేయగలనని ప్రకటించారు.
అత్యంత ప్రధానమైన అమేథి పార్లమెంటరీ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం అధికారికంగా 40 శాతం మాత్రమే నమోదు కావడం కాంగ్రెస్ పార్టీకి, గాంధి కుటుంబానికి తీవ్రంగా దిగ్భ్రాంతి కలిగించింది. తుది పోలింగ్ గణాంకాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ తన సోదరి వాగ్దానం చేసినట్లుగా రాహుల్ కు రికార్డు స్థాయి ఆధిక్యంతో విజయం మాత్రం అసాధ్యమనేది తేలుతున్నది. రాహుల్ కు రికార్డు స్థాయిలో ఆధిక్యం సంపాదిస్తానని ప్రియాంక ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించారు.
'కేవలం 40 శాతం ఓట్లు పోలైనట్లు నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను' అని ప్రియాంక వాద్రా శుక్రవారం రాయబరేలిలో విలేఖరులకు తెలియజేశారు. 'నేను నిద్ర పోలేకపోయాను. 45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఇసి అధికారులు ఇప్పుడు నాకు తెలియజేశారు. ఇక నేను హాయిగా నిద్రిస్తాను' అని ఆమె చెప్పారు.
2004 ఎన్నికలలో కూడా అమేథి లోక్ సభ నియోజకవర్గంలో దాదాపు 45 శాతం మంది ఓటర్లు ఓట్లు వేశారు. అమేథి, రాయ్ బరేలి నియోజకవర్గాలకు మీడియా ఇన్ చార్జి అయిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్ సింగ్ 'డిఎన్ఎ' వార్తా సంస్థ విలేఖరితో మాట్లాడుతూ, అమేథిలో 45.23 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలియజేశారు. 2004లో రాహుల్ 2.90 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.
News Posted: 25 April, 2009
|