ఉప ప్రధానిగా మోడి!
అహ్మదాబాద్, న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి దేశ ప్రధాని కాగల లక్షణాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకులు ఇద్దరు శుక్రవారం అభిప్రాయం వెలిబుచ్చారు.
దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ పదవి ప్రధాని పదవికి నరేంద్ర మోడి అర్హుడేనని బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ శౌరి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే, తమ ప్రకటనల విషయంలో వారు ఆచితూచి వ్యవహరించారు.
గుజరాత్ రాష్ట్రానికి ఇద్దరు ప్రధాన మంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని, ఇప్పుడు ఎల్.కె. అద్వానీని, తరువాత నరేంద్ర మోడిని ఎన్నుకోవచ్చునని శౌరి అహ్మదాబాద్ లో విలేఖరులతో అన్నారు. 'ప్రస్తుత లోక్ సభ ఎన్నికల అనంతరం గుజరాత్ అద్వానీని ప్రధానిగా ఎన్నుకోవచ్చు. మోడిని తదుపరి ప్రధానిగా ఎన్నుకోవచ్చు' అని శౌరి అన్నట్లు 'యుఎన్ఐ' వార్తా సంస్థ తెలియజేసింది.
'గుజరాత్ మూడు అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. మొదటిది అద్వానీని ఇప్పుడు ప్రధానిగా ఎన్నుకోవడం. రెండవది గుజరాత్ నుంచి ప్రధానిని ఎన్నుకునేందుకు, రాష్ట్రాన్ని పాలిస్తున్న అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని కలిగి ఉండేందుకు పరిస్థితిని సృష్టించుకోవడం. ఇక మూడవది తదుపరి ప్రధానిని (మోడిని) కూడా గుజరాత్ నుంచి ఎన్నుకోవడం' అని అరుణ్ శౌరి అని వివరించారు.
అయితే, 'బిజెపి తదుపరి ప్రధాని అభ్యర్థిగా మోడిని సూచించడం నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను. ఇది పార్టీ అభిప్రాయం కాదు' అని శౌరి స్పష్టం చేశారు. 'పార్టీ, దేశం కూడా మోడిలో ఒక జాతీయ నాయకుని చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికే గుజరాత్ కు బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీని, మౌలిక వసతులను, ఉద్యోగాల కల్పనను సాధించారు. ఇతర రాజకీయ పార్టీలు వీటిని రానున్న ఐదు సంవత్సరాలలో తమ ఎన్నికల ప్రణాళికలలో వాగ్దానం చేశాయి' అని శౌరి పేర్కొన్నారు.
రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, నరేంద్ర మోడి బిజెపి ప్రభుత్వంలో ఉప ప్రధాని కావచ్చునని సూచించారు. 'మోడికి ప్రధాని కాగలద లక్షణాలు అన్నీ ఉన్నాయి. బిజెపిలో ఆనువంశిక రాజకీయాలు లేవు. అయినా ఎవరు ఉప ప్రధాని కావాలో నిర్ణయించే అధికారం ప్రధానిదే' అని ప్రసాద్ చెప్పారు.
News Posted: 25 April, 2009
|