రాష్ట్రంలో యెడ్యూరప్ప పద్ధతి!
హైదరాబాద్ : రాష్ట్రంలో హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి.
తమకే మెజారిటీ లభిస్తుందని బయట ఎంతగా గొప్పలు చెప్పుకున్నప్పటికీ ఆంతరంగికంగా మాత్రం 294 స్థానాలున్న శాసనసభలో సాధారణ మెజారిటీ కావలసిన 148 స్థానాలు గెలుచుకోలేకపోవచ్చునని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వం స్థాపనకు తగినంత మంది ఎంఎల్ఎలను సమీకరించడానికి పార్టీలు కొత్త పద్ధతుల గురించి ఆలోచిస్తున్నాయి.
ఒక పద్ధతి ఏమిటంటే ఏకైక పెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు రూపుదిద్దుకున్న అతి పెద్ద సంకీర్ణం సాధారణ మెజారిటీ సాధించడానికి మద్దతు లేఖలు సంపాదించడం. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ), ఎంఐఎం, ఇండిపెండెంట్లు, రిబెల్స్, చివరగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వంటి చిన్న పార్టీలకు చెందిన, ఎవరితోను సంబంధం లేని సభ్యుల ఓట్లు చాలా ఉండవచ్చు.
మరొక పద్ధతి ఏమిటంటే కర్నాటకలో బి.ఎస్. యెడ్యూరప్ప అనుసరించిన విధానం. నిరుడు మే నెలలో 225 సభ్యుల కర్నాటక శాసనసభకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 110 సీట్లను గెలుచుకున్నది. మెజారిటీకి 3 సీట్లు తగ్గాయి. మెజారిటీ సాధించడానికి యెడ్యూరప్ప ఇండిపెండెంట్ల మద్దతును సంపాదించారు. అయితే, దీని వల్ల బిజెపి ఇండిపెండెంట్ల కరుణా కటాక్షాలపై ఆధారపడవలసి వస్తుంది కనుక యెడ్యూరప్ప కాంగ్రెస్, జనతా దళ్ (ఎస్) నుంచి కొందరు సభ్యులను పార్టీ ఫిరాయించేట్లు చేసి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఫిరాయింపుల నిషేధ చట్టం కింద ఫిరాయింపుదారులు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు.
ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం ఫిరాయింపుదారుడు సభలో ఓటు వేయడానికి వీలు ఉంటుంది. కాని ఓటు వేసిన అనంతరం ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది.
ఈ విషయం గ్రహించిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తమ పార్టీ తరఫున ఎన్నికయ్యే వారిని మరే పార్టీ సంప్రదించకుండా అడ్డుకోవడానికి వారినందరినీ తెలంగాణ భవన్ కు రావలసిందిగా ఆదేశించారు.
ఇక చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ జారీ చేసిన విప్ చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిఆర్పీ ఎన్నికలలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు లేదా చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం సంపాదించినట్లయితే, విప్ నకు ఆటోమేటిక్ గా గుర్తింపు లభిస్తుంది. (పిఆర్పీ కనీసం రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది). అయితే, యెడ్యూరప్ప పద్ధతిలో ప్రలోభానికి ఏ ఇతర చిన్న పార్టీ వలె ప్రజా రాజ్యం పార్టీ లోనయ్యే అవకాశం ఉంది. అయితే. తమ ఎంఎల్ఎలను ఇతర పార్టీలు ఆశ్రయించకుండా తాము ఎలా నిరోధించబోతున్నదీ చెప్పడానికి పిఆర్పీ అధికార ప్రతినిధులు ఇష్టపడడం లేదు.
హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారు? ప్రభుత్వ స్థాపన కోసం ఏదైనా పార్టీని, లేదా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీల కూటమిని ఆహ్వానించే విచక్షణాధికారం గవర్నర్ కు ఉంది. సంప్రదాయాలను, అనూచానంగా వస్తున్న పద్ధతులు మినహా ఎవరిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలనే నిర్దుష్ట మార్గదర్శక సూత్రాలు గాని, నిబంధనలు గాని లేవు.
1998 మార్చి 15న అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తన ప్రకటనలో ఈవిషయాన్ని స్పష్టంగా సూచించారు. 'ఏ పార్టీకీ లేదా పార్టీలు ఎన్నికల ముందు ఏర్పాటు చేసుకున్న కూటమికి స్పష్టమైన మెజారిటీ లేనప్పడు ఇండియాలోను, ఇతర దేశాలలోను దేశాధినేత అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్న పార్టీకి లేదా పార్టీల కూటమికి మొదట అవకాశం ఇచ్చారు. అయితే, అలా నియుక్తుడైన ప్రధాని నిర్దుష్ట వ్యవధిలోగా సభలో మెజారిటీ మద్దతును నిరూపించుకోవాలి' అని నారాయణన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
'అయితే, ఈ ప్రక్రియ అన్ని కాలాలకు వర్తించే సూత్రం కాదు. ఎందుకంటే ఏ ఒక్క పెద్ద పార్టీకి లేదా కూటమికి చెందని ఎంపిలు సమష్ఠిగా ఏకైక పెద్ద పార్టీ బలాన్ని మించిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు' అని ఆయన పేర్కొన్నారు.
సభలో సగానికి మించి స్థానాలు ఏ పార్టీకి రాని పక్షంలో సంకీర్ణ భాగస్వామ్య పార్టీలనుంచి మద్దతు లేఖలు సంపాదించే పద్ధతిని కూడా రాష్ట్రపతి ప్రవేశపెట్టారు.
మహా కూటమి సీట్ల సర్దుబాటు గతానికి సంబంధించినదని, ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను ప్రకటించే పార్టీకి లేదా కూటమికి మద్దతు ఇవ్వడంపై తమ పార్టీ తిరిగి కొత్తగా నిర్ణయం తీసుకోగలదని టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో ఈ అలిఖిత నిబంధన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నది.
News Posted: 26 April, 2009
|