బాబు కుమారోత్థానం!
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) ప్రధాన కార్యాలయంలో వినిపిస్తున్న గుసగుసలను విశ్వసించే పక్షంలో పార్టీలో 'కుమారోత్థానానికి' రంగం సిద్ధం అవుతున్నది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలివిగా పార్టీ ప్రధాన ప్రచారకులు సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను పక్కకు తప్పించనారంభించి తన వారసుడిగా తన కుమారుడు లోకేష్ నాయుడును పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో ప్రశంసించిన చంద్రబాబు నాయుడు వారి సేవల గురించి ఇప్పుడు అంతగా మాట్లాడడం లేదు. హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తరువాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించలేదు. కాని ఒక ప్రాంతీయ భాష పత్రిక ఆ విషయంపై ఒక వార్తను ప్రచురించిన తరువాతే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు.
ఈ మధ్య తన నివాసంలో మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు టిడిపిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేది తనకు ప్రీతిపాత్రమైన నగదు బదలీ పథకమేనని నొక్కి చెప్పసాగారు. నగదు బదలీ పథకం (సిటిఎస్)కు సూత్రధారుడు తన కుమారుడు లోకేష్ అని చంద్రబాబు ప్రకటించిన తరువాత ఆయన తెలివిగా పన్నుతున్న రాజకీయ వ్యూహం వెలుగులోకి వచ్చిందని పార్టీ ఆంతరంగికులు పేర్కొన్నారు. ఆతరువాత చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు నిర్వహించడానికి లోకేష్ ను పంపారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలకు పేరొందినవారు. తన మావగారు ఎన్.టి. రామారావుపై తిరుగుబాటు చేసిన సమయంలో చంద్రబాబు ఆయన కుమారుడు హరికృష్ణ, ఆయన అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుల సాయం తీసుకున్నారు. ఆ తరువాత చంద్రబాబు వారిద్దరిని పక్కకు నెట్టేశారు. దానితో ఆగ్రహావేశాలకు లోనైన హరికృష్ణ ఆయనపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 'ఉపయోగించుకుని వదలివేసే' విధానమని హరికృష్ణ ఆరోపించారు. కాగా, చంద్రబాబు ఎత్తుగడల గురించి అప్రమత్తంగా ఉండవలసిందని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల హెచ్చరించారు కూడా.
News Posted: 26 April, 2009
|