`కెసిఆర్ అటు వెళితే ఏమి'
హైదరాబాద్ : మహాకూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ముందుకు సాగడానికి తెలుగు దేశం పార్టీ (టిడిపి) సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరింత కట్టుబడి ఉన్న దృష్ట్యా ఎన్నికల అనంతరం బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)లోకి టిఆర్ఎస్ చేరగలదని టిడిపి ఊహిస్తున్నది. 'టిఆర్ఎస్ రాష్ట్రంలో మహా కూటమిలో భాగస్వామ్య పక్షం అనడంలో సందేహం ఏమాత్రం లేదు. అది రాష్ట్రంలో టిడిపికి మద్దతు ఇవ్వగలదు. అయితే, అదే సమయంలో ఆ ప్రత్యేక రాష్ట్రవాద పార్టీ కేంద్రంలో ఎన్ డిఎకు మద్దతు అందజేసినా మేము ఏమాత్రం పట్టించుకోం' అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు.
మొదటి దశ ఎన్నికలు ముగిసిన మరుక్షణమే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎన్నికల అనంతరం బిజెపి సారథ్యంలోని ఎన్ డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సూచించారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎన్ డిఎకే ఎక్కువగా ఉందని కెసిఆర్ భావిస్తున్నారు. టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఢిల్లీలో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు టిఆర్ఎస్ కు ఉందని చెప్పారు. అయితే, తమ పార్టీ బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. 'కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. అందువల్ల బిజెపికి టిడిపి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు' అని ఆ నాయకుడు విస్పష్టంగా చెప్పారు. కాగా, ఈ దఫా హంగ్ శాసనసభ ఏర్పడగలదని ఊహిస్తూ బిజెపి రాష్ట్ర నాయకత్వం టిడిపి కనుక వామపక్షాలను దూరం చేసుకుంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తాము సుముఖమేనని తెలియజేసింది. అయితే, బిజెపికి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే సీట్లు లభిస్తాయని అంటూ టిడిపి నాయకులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.
News Posted: 26 April, 2009
|