టిడిపికి కెసిఆర్ తలనొప్పి
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వీలుగా కొత్త శాసనసభ తొలి సమావేశంలోనే ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) డిమాండ్ తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకులకు మింగుడుపడడం లేదు. కాని ఆ విషయం బయటకు చెప్పడం లేదు. కారణం - రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ వేర్పాటువాద పార్టీ మద్దతు అవసరం కావచ్చు.
అయితే, టిఆర్ఎస్ అలా కోరడంలో వారికి తప్పేమీ కనిపించడం లేదు. 'ప్రత్యేక తెలంగాణపై టిడిపి వైఖరి సుస్పష్టం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించడంతో సహా రాజ్యాంగపరమైన లాంఛనాలన్నిటినీ మేము పూర్తిచేస్తామని మా ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశాం' అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు తెలియజేశారు.
అయితే, టిడిపి శిబిరం లోపల మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొత్త శాసనసభ తొలి సమావేశంలోనే ఒక తీర్మానాన్ని ఆమోదించడంపై టిడిపి నాయకులు కొందరు, చివరకు తెలంగాణ ప్రాంతం వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అంశంపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని, తదుపరి కేంద్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల కోసం బేరసారాలు ఆడేందుకు హడావుడిగా ఢిల్లీ యాత్ర చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కెసిఆర్ ఈ విధంగా హడావుడి పడడం గతంలో వలె కేంద్ర ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవులు దక్కించుకోవడానికే తప్ప మరి దేనికీ కాదని పేరు వెల్లడి చేయరాదనే షరతుతో టిడిపి నాయకుడు ఒకరు మీడియాతో అన్నారు.
'ఈ సమయంలో టిఆర్ఎస్ అధినేత ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి తప్ప మరే కారణమూ లేదు' అని టిడిపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు తమ సొంత మనుగడ కోసం కె. చంద్రశేఖరరావు డిమాండ్ సమంజసమైనదేనని అంటున్నారు. 'కెసిఆర్ ఈ డిమాండ్ చేస్తున్నారనే సంగతి మరచిపోండి. తెలంగాణ ప్రాంతంలోని ప్రజల కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించాలి' అని టిడిపి నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. 'అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే మంచిదే' అని శ్రీహరి 'ఎక్స్ ప్రెస్' విలేఖరితో అన్నారు. 'బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టిడిపి కట్టుబడి ఉందనే సందేశాన్ని జనానికి మేము చేరవేయగలం' అని శ్రీహరి చెప్పారు.
News Posted: 27 April, 2009
|