ఫస్ట్ టైమర్లే పాపులర్
ముంబై : క్రితం వారం ఇండియా లో కన్నా పాకిస్తాన్ లోనే అధిక సంఖ్యాకులు సంజయ్ దత్ కోసం ఆన్ లైన్ లో అన్వేషణ జరిపారు. సంజయ్ ముంబైలో కన్నా భోపాల్ లోనే ఎక్కువ పాపులర్. ఇక మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేసినవారు యువ నాయకుల (యంగ్ టర్క్ ల) కన్నా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గూగుల్ సైట్ లో అన్వేషణ సరళులను పరిగణనలోకి తీసుకుంటే ఎల్.కె. అద్వానీ, సోనియా గాంధి వంటి రాజకీయ బడా నాయకులతో పాటు కొత్త రాజకీయ నాయకులు సెర్చ్ లిస్టులలో అగ్రస్థానంలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం అత్యధికంగా వీక్షకులు అన్వేషిస్తున్న పది మంది అగ్రశ్రేణి రాజకీయ నాయకులలో శశి థరూర్, చిరంజీవి, సంజయ్ దత్ కూడా ఉన్నారు. ఆ జాబితాలో ఇంకా మన్మోహన్ సింగ్, మాయావతి, నరేంద్ర మోడి, వరుణ్ గాంధి కూడా ఉన్నారు.
'ఇతర వృత్తుల నుంచి రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న వారి గురించి యువతరం అమితాసక్తి కనబరుస్తుండడం గమనార్హం' అని గూగుల్ సర్చెస్ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ అంకుర్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు ఇండియాలో దాదాపు 3.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 'మా యూజర్లలో చాలా మంది 18, 30 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు' అని ఆయన తెలిపారు.
కొత్త రాజకీయ నాయకులు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను తమ సొంత నగరాలలో వెనుకకు నెట్టారు, ఇతర నగరాలలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఇస్తున్నారు. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, తిరువనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శశి థరూర్ బెంగళూరు, ముంబై, ఢిల్లీలోనే ఎక్కువ పాపులర్ అయ్యారు.
ఇక హైదరాబాద్ లో ఇంటర్నెట్ లో చిరంజీవి పాపులారిటీ రాహుల్ గాంధికి దాదాపు సరిసమానంగా ఉన్నది.
News Posted: 27 April, 2009
|