స్పీకర్ గెలుపు డౌటే!
నిజామాబాద్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధికి సమర్పించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) విజయావకాశాలు ఉన్న అభ్యర్థుల పేర్లతో రూపొందించిన జాబితాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి పేర్లు లేనట్లు తెలుస్తున్నది. జాబితాతో సోమవారం ఢిల్లీకి వెళ్ళిన పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో పేలవమైన పార్టీ ప్రదర్శనకు కారణాలను సోనియా గాంధికి వివరించగలరని నిజామాబాద్ లో పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఏప్రిల్ 16న ఎన్నికలు జరిగిన తొమ్మిది అసెంబ్లీ సెగ్మంట్లలో ఇద్దరు మాత్రమే గెలవగలరని పిసిసి అధ్యక్షుడు తన నివేదికలో పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు నిజామాబాద్ అర్బన్ స్థానానికి పోటీ చేసిన డి.శ్రీనివాస్ (డిఎస్) కాగా రెండవ అభ్యర్థి, బాల్కొండ స్థానానికి పోటీ చేసిన ఎస్.శ్రీనివాసరెడ్డి.
తాను, బాల్కొండలో శ్రీనివాసరెడ్డి గెలవడం తథ్యమని డిఎస్ భావిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఎస్. శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అసమ్మతి ఎంఎల్ఎ ఎస్. సంతోష్ రెడ్డి కుమారుడు. అయితే, జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలోను, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోను పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గడుగు గంగాధర్ ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు రూపొందించిన జాబితాలో సురేష్ రెడ్డి, షబ్బీర్ అలీ పేర్లతో పాటు సిట్టింగ్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (బాన్స్ వాడ), సుదర్శన్ రెడ్డి (బోధన్), జనార్దన్ గౌడ్ (యెల్లారెడ్డి), ఆకుల లలిత (నిజామాబాద్ రూరల్) పేర్లు కూడా లేవని పార్టీ వర్గాలు తెలియజేశాయి. 'ఈ అభ్యర్థులు తమ తమ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నందున వీరి పేర్లను జాబితాలో డిఎస్ చేర్చలేదు' అని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులపై మాత్రమే విశ్వాసం వెలిబుచ్చారని, వారిని అధిక మెజారిటీతో ఎన్నుకుంటారని డిసిసి అధ్యక్షుడు చెబుతున్నారు. 'వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు, పింఛన్లు, రైతులకు రుణాల మాఫీ, ఎన్ఆర్ఇజిఎస్, ఇందిరమ్మ ఇళ్ళు, కిలో రూ. 2 బియ్యం పథకాల ధర్మమా అని మా పార్టీ అఖండ విజయం సాధిస్తుంది' అని ఆయన అన్నారు. అయితే, సునిశిత పరిశీలన అనంతరం పిసిసి అధ్యక్షుడు ఈ జాబితాను సిద్ధం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 'నిజామాబాద్ జిల్లాలో అగ్ర నాయక త్రయం పట్ల ఓటర్ల వ్యతిరేకత ప్రభావంగానే షబ్బీర్, సురేష్, ఆ మాటకు వస్తే డిఎస్ గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి' అని ఒక విశ్లేషకుడు చెప్పారు.
News Posted: 28 April, 2009
|