పిఆర్పీపై టిడిపిలో తలోమాట
హైదరాబాద్ : రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) మద్దతు తీసుకోవడంపై తెలుగు దేశం పార్టీ (టిడిపి)లోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, నగదు బదలీ, కలర్ టివిల పథకాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సాధారణ మెజారిటీ లభిస్తుందనే నమ్మకం టిడిపికి లేదు. సాధారణ మెజారిటీకి సీట్ల సంఖ్య కొరవడినట్లయితే పిఆర్పీ మద్దతు స్వీకరించడంతో సహా రకరకాల మార్గాలలో దేనిని అనుసరించాలో పార్టీ పరిశీలిస్తున్నది.
పిఆర్పీ గెలుచుకునే 30, 35 మధ్య అసెంబ్లీ సీట్లలో అధిక సంఖ్యాకులు మాజీ టిడిపి నాయకులేననే అభిప్రాయాన్ని టిడిపి నాయకులలో ఒక వర్గం వారు వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి కనుక సాధారణ మెజారిటీ కొరవడిన పక్షంలో, ఈ పర్యాయం పిఆర్పీ టిక్కెట్ పై గెలిచే అవకాశం ఉన్న మాజీ నాయకుల మద్దతును స్వీకరించే అవకాశాన్ని పరిశీలించాలనే అభిప్రాయం టిడిపిలో వ్యక్తం అవుతున్నది.
పార్టీలోని తెలంగాణ నాయకులు ఇందుకు విముఖంగా లేరు. 'పార్టీకి చెందిన ఏ మాజీ నాయకుడైనా తిరిగి టిడిపి వైపు రావాలని అభిలషించిన పక్షంలో మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి' అని తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి నాయకుడు ఒకరు ప్రశ్నించారు. కాని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు అటువంటి ప్రతిపాదనను ఇష్టపడడం లేదు. 'పార్టీని వదలి వెళ్ళినవారిని పార్టీలోకి తిరిగి రానివ్వరాదు' అని ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి నాయకుడు ఒకరు స్పష్టం చేశారు.
పిఆర్పీ టిక్కెట్ పై పోటీ చేసిన ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి నాయకులందరూ మూడవ స్థానంతో తృప్తి పడగలరు. ప్రభుత్వం ఏర్పాటు కోసం వారి మద్దతు తీసుకోవలసిన ప్రశ్నే తలెత్తదని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. 'పార్టీని వదలి వెళ్ళినవారి విషయాన్ని అసలు పరిశీలించకూడదు. వారిని తిరిగి ఆహ్వానించరాదు' అని ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు స్పష్టం చేశారు.
పార్టీ నాయకులు జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం, మహా కూటమి రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. 'మహా కూటమికి 160కి పైగానే సీట్లు లభించగలవు' అని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. అయితే, టిడిపికి టిఆర్ఎస్ బేషరతుగా మద్దతు అందజేస్తుందా అనేది అనుమానమేనని టిడిపిలో ఒక వర్గం నాయకులు అంటున్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వైఖరి చివరి క్షణంలో మారిపోవచ్చునని వారు సూచిస్తున్నారు.
ఇటీవల సమావేశమైన టిడిపి పొలిట్ బ్యూరో తమ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించగలదని, ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పార్టీని ఆహ్వానించగలరని అభిప్రాయపడిన విషయం విదితమే. పార్టీ సభ్యుడే అసెంబ్లీ స్పీకర్ కాగలరు కనుక సంఖ్యాబలాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్ చేసే ప్రయత్నాలను ఆయన మొగ్గలేనే తుంచివేయగలరని, సభలో బలాబలాల పరీక్ష ఏదైనా జరిగినప్పటికీ స్పీకర్ సకాలంలో చర్య తీసుకుని ఫిరాయింపుదారులను అనర్హులను చేయగలరని టిడిపి భావిస్తున్నది.
అయితే, టిడిపి నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు వాదన మరొక విధంగా ఉన్నది. తాము పిఆర్పీ నాయకత్వాన్ని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. 'ప్రభుత్వం ఏర్పాటు కోసం టిడిపికి సాధారణ మెజారిటీ లభిస్తుంది కనుక పిఆర్పీ మద్దతు మేము కోరం' అని దయాకరరావు చెప్పారు.
News Posted: 30 April, 2009
|