మారిన కెసిఆర్ వైఖరి
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసే కేంద్రంలో ఏ పార్టీకైనా లేదా సంకీర్ణానికైనా తమ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ మద్దతు ఇవ్వగలదనే సంకేతాలను పంపిన తరువాత పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలోని సంకీర్ణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆ కూటమిలో చేరే అవకాశాలపై బిజెపితో చర్చలు జరిపేందుకు విజయశాంతి సేవలు ఉపయోగించుకుంటున్నారు.
విజయశాంతి గడచిన రెండు రోజులలో ఎల్.కె. అద్వానీ, ఎం. వెంకయ్య నాయుడులతో సహా బిజెపి కేంద్ర నాయకులతో ఫోన్ లో చర్చలు జరిపారు. 'కెసిఆర్ తరఫున విజయశాంతి చర్చలు సాగిస్తున్నా కేంద్ర క్యాబినెట్ మంత్రి కావాలని ఆమె ఆకాంక్షిస్తున్నదనేది రహస్యమేమీ కాదు' అని విజయశాంతికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న కెసిఆర్ వైఖరితో విసుగు చెందిన టిఆర్ఎస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, తెలంగాణ కలను సాఫల్యం చేయగలవి కాంగ్రెస్, బిజెపి వంటి జాతీయ పార్టీలు మాత్రమేనని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 'మహా కూటమి భాగస్వామ్య పార్టీ తెలుగు దేశం పార్టీ (టిడిపి)ని అంటిపెట్టుకుని ఉండలేని పరిస్థితి దీని వల్ల కెసిఆర్ కు కలుగుతున్నది. ఇక ఈ దశలో బిజెపి పట్ల సానుకూలతను వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీతో బేరసారాలు సాగించే శక్తిని పెంచుకోవడమే ఆయన ఉద్దేశం' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, ఈ రెండు మార్గాలలో కెసిఆర్ బిజెపితో కన్నా కాంగ్రెస్ పార్టీతో కలసి సాగడానికే ఇష్టపడగలరని ఆ వర్గాలు సూచించాయి. 'కాని ఇప్పటికిప్పుడు కెసిఆర్ కు వస్తున్న సమస్య ఏమిటంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నూరు రోజులలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలమని బిజెపి వాగ్దానం చేయగా కాంగ్రెస్ తన సందిగ్ధ వైఖరిని మార్చుకోకపోవడం. దీని వల్ల ఆ పార్టీ చివరకు తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడవచ్చు' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
బిజెపితో టిఆర్ఎస్ చెలిమి చేయాలని విజయశాంతి పట్టుపడుతున్నప్పటికీ కెసిఆర్ తీసుకునే నిర్ణయానికి ఆమె బద్ధురాలై ఉండగలదని ఆమె సన్నిహిత సహచరుడు ఒకరు తెలిపారు. 'ఆమెకు గతంలో బిజెపితో అనుబంధం ఉన్న కారణంగా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆమెను తన తరఫున మితవాద పార్టీ నాయకులతో చర్చలకు పంపించారు. బిజెపి స్పందన గురించిన ఆమె అందజేస్తున్న సమాచారం ప్రోత్సాహకరంగా ఉంది' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పారు.
అయితే, విజయశాంతికి కెసిఆర్ అప్పగించిన బాధ్యతల పట్ల పార్టీలో ఏ ఒక్కరూ ఆశ్చర్యపోవడం లేదు. 'ఆమె హఠాత్తుగా ప్రత్యక్షమై పార్టీ టిక్కెట్ పొందారు. ఇప్పుడు ఆమె పార్టీలో నంబర్ 2 గా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ నగరంలో లేకపోతే ఆమె తెలంగాణ భవన్ లోకి అడుగుపెట్టరు' అని టిఆర్ఎస్ లో అసంతుష్టుడైన ఒక నాయకుడు పేర్కొన్నారు.
క్రితం సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ ఎనిమిదవ ఆవిర్భావ వార్షికోత్సవ కార్యక్రమానికి కూడా విజయశాంతి హాజరు కాలేదు.
News Posted: 30 April, 2009
|