'నిర్బంధ ఓటింగ్ ఉండాలి'
గాంధీనగర్ : లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు నిర్థారిత గడువు ఉండాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ గురువారం కోరారు. ఎన్నికలను ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తుండాలని, ఓటింగ్ ను నిర్బంధం చేయాలని కూడా అద్వానీ కోరారు.
'లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు నిర్థారిత కాలపరిమితి ఉండేందుకు మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చునా అనే విషయమై రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ (ఇసి) ఆలోచించాలని సూచిస్తున్నాను' అని 81 సంవత్సరాల అద్వానీ గురువారం గాంధీనగర్ లో తన వోటు వేసిన అనంతరం మీడియాతో అన్నారు. 'మనం యుకె పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఇది మనకు అనువైనది కాదు. మనం దీనిని మార్చాలి' అని ఆయన అన్నారు.
ఏదైనా ప్రభుత్వం లోక్ సభలో మెజారిటీనీ కోల్పోయినప్పటికీ సభను రద్దు చేయరాదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలనేది అద్వానీ సూచనకు అర్థం.
వేసవి నెలలలో ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల కలుగుతున్న ఇబ్బందుల గురించి అద్వానీ ప్రస్తావిస్తూ, 'వేసవిలో పోలింగ్ శాతం తగ్గిపోతుంటుంది. ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలి' అని సూచించారు. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని కూడా అద్వానీ కోరారు. 'ఓటింగ్ ను నిర్బంధం చేయడాన్ని గురించి ఇసి, రాజకీయ పార్టీలు చర్చించాలి' అని ఆయన సూచించారు.
గాంధీనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన అద్వానీ తన భార్యతో కలసి ఉదయమే ఓటు వేశారు.
బిజెపి ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించగలదని, కేంద్రంలో ఎన్ డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని అద్వానీ జోస్యం చెప్పారు. 'దేశం అంతటా పర్యటించిన తరువాత నేను బిజెపి ఏకైక పెద్ద పార్టీగా అవతరించగలదని, ఎన్ డిఎ అతి పెద్ద కూటమి కాగలదని ఆశిస్తున్నాను' అని ఆయన చెప్పారు.
'దేశంలో ఎన్నికల విషయమై నేను సూచనలు ఇవ్వదలిచాను. 1952 నుంచి 1967 వరకు మొదటి నాలుగు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను కలసే నిర్వహించారు. కాని ఆతరువాత 1971లో పార్లమెంట్ ను రద్దు చేయడంతో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించసాగారు' అని ఆయన తెలిపారు. 'గత కొన్ని సంవత్సరాలలో ప్రతి రెండు సంవత్సరాలకు సార్వత్రిక ఎన్నికలు లేదా మినీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తుండడం మన అనుభవంలోకి వచ్చింది' అని అద్వానీ చెప్పారు.
'ఈ పరిస్థితి పాలనకు మంచిది కాదు. నేను ఒక సూచన చేయదలిచాను. దానిపై అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ బాగా ఆలోచించాలి' అని ఆయన పేర్కొన్నారు. లోక్ సభ ఒక్కదానితోనే కాకుండా దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర శాసనసభలతో ఇండియా ఒక ఫెడరల్ దేశమని ఆయన చెప్పారు. శాసనవ్యవస్థకు నిర్థారిత కాలపరిమితి గల పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు యూరప్ లో అనేకం ఉన్నాయని అద్వానీ తెలియజేశారు.
News Posted: 30 April, 2009
|