మారుపేరుతో రాహుల్ చదువు
న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో తన బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేస్తున్నప్పుడు మారు పేరుతో నివసించవలసి వచ్చింది. 1991లో తవ తండ్రి రాజీవ్ గాంధి దారుణ హత్య పర్యవసానంగా రాహుల్ ఇలా మారుపేరుతో వ్యవహరించవలసి వచ్చింది. రాహుల్ అప్పట్లో హార్వర్డ్ లో చదువుతున్నారు. కాని విశ్వవిద్యాలయ అధికారులు, భద్రతా సంస్థల పూర్తి పరరిజ్ఞానంతోనే ఆయన అక్కడి నుంచి కదలవలసి వచ్చింది.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజీ నుంచి తాను డెవలప్ మెంట్ ఎకనామిక్స్ లో తన డిగ్రా పూర్తి చేయలేదని ఆరోపించినందుకు ఒక వార్తాపత్రికకు రాహుల్ ఇచ్చిన లీగల్ నోటీస్ లో ఈ విషయం వెల్లడి చేశారు. తాను 1994 అక్టోబర్ నుంచి 1995 జూలై వరకు ట్రినిటీ కాలేజీలో సభ్యునిగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థినని, 1995లో డెవలప్ మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ డిగ్రీ ప్రదానం చేశారని నిర్థారిస్తూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎలిసన్ రిచర్డ్ నుంచి వచ్చిన ఒక లేఖను రాహుల్ తన లీగల్ నోటీస్ కు జత చేశారు.
రాహుల్ కు రాసిన తన లేఖలో ప్రొఫెసర్ రిచర్డ్ ఇండియాలో ఇటీవలి వివాదం పట్ల విచారం వెలిబుచ్చారు. 'మీ డిగ్రీ గురించి వివాదం తలెత్తడం నిజంగా దురదృష్టకరం. ఈ వివాదాన్ని నిలుపుదల చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం' అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధి ప్రవర్తన 'విశిష్టంగా' ఉందని ఆమె తెలిపారు.
రాహుల్ అందజేసిన విద్యావిషయక వివరాల ప్రకారం, ఆయన 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరి, మొదటి సంవత్సరం పరీక్ష పాసైన తరువాత హార్వర్డ్ కు వెళ్ళారు. 1991 తన తండ్రి హత్య అనంతరం ఆయన ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి మారి తన డిగ్రీ పూర్తి చేయడానికి భద్రతా సంస్థల పరిజ్ఞానంతోనే మారు పేరుతో జీవించవలసి వచ్చింది.
News Posted: 30 April, 2009
|