ఏది వచ్చినా సిబ్బందికే లబ్ధి
హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల గురించి ఏమాత్రం ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటున్నవారు ఎవరో ఊహించండి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లే. కారణం ఊహించడం కష్టమేమీ కాదు. రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి) వారిపై ఎన్నో వరాలు గుప్పించాయి. ఆ రెండింటిలో ఏది అధికారంలోకి వచ్చినా లబ్ధి పొందేది ఉద్యోగులు మాత్రమే.
తొమ్మిది సంవత్సరాల టిడిపి పాలనలో ప్రభుత్వం ఉద్యోగులు, టీచర్లు ఎంతో ఒత్తిడికి గురయ్యారు. ఫైళ్ళ పరిష్కార వారాలు, జన్మభూమి, సర్వేలు, ప్రభావం నివేదికలు,ఇతర దైనందిన కార్యక్రమాలు పెక్కింటితో వారిపై పని భారం పెరిగిపోయింది. మరొక వైపు వారి పని తీరుపై సమీక్షలు పెరిగాయి. పనితీరు సూచికలు, మదింపు నివేదికల వంటి పద్ధతులు ప్రవేశపెట్టడంతో వారు మరొక విధంగా ఒత్తిడికి గురయ్యారు. అంతేకాకుండా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను నిద్రపోనని, ఉద్యోగులనూ నిద్ర పోనివ్వనని చాలా సందర్భాలలో ప్రకటించారు. 2004 ఎన్నికలలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయడమే కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని కూడా అప్పట్లో భావించారు. ఆతరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల కోర్కెలు చాలా వాటికి సానుకూలంగా స్పందించింది. తాత్కాలిక భృతిని పెంచడమే కాకుండా ఉద్యోగులు ఎటువంటి ఆందోళనకూ పూనుకోకుండానే మరి కొన్ని ప్రయోజనాలు కల్పించింది. అయితే, కొన్ని టీచర్ల సంస్థలు మాత్రం సమ్మె చేశాయి కాని అప్రెంటిస్ టీచర్ల స్టైపెండ్ లో పెంపు మినహా అంతగా అవి సాధించిందదేమీ లేదు.
ఇటీవలి ఎన్నికలలో టీచర్ల, ఉద్యోగుల సంఘాలు ఏ పార్టీకీ బాహాటంగా మద్దతు ఇవ్వలేదు. కాని ఎపిఎస్ఆర్ టిసిలో మాత్రం వామపక్ష కార్మిక సంఘాలు టిడిపి నాయకత్వంలోని మహా కూటమికి మద్దతు ఇవ్వాలని కార్మికులకు పిలుపు ఇచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను మారిన మనిషినని ప్రభుత్వోద్యోగులకు భరోసా ఇచ్చారు. టిడిపి తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే వారానికి ఐదు పని రోజుల పద్ధతిని ప్రవేశపెట్టగలనని ఆయన వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అయితే తన ప్రభుత్వ ఇంతకు ముందు అనుసరించిన ఉద్యోగుల అనుకూల విధానాలనే తాను కొనసాగించగలనని హామీ ఇచ్చారు.
News Posted: 1 May, 2009
|