విజయవాడ : సీన్ 1: చీరాల రామ్ నగర్ లోని జనం ఏప్రిల్ 23న సాయంత్రం 4.30 గంటల వరకు తమ ఓట్లు వేయలేదు. అభ్యర్థులు నగదు పంపిణీ చేయనందుకు వారు ఈ విధంగా తమ నిరసన తెలియజేశారు. అయితే, తాము ఓట్లు వేసేందుకు వెళ్ళకపోయినా పోలింగ్ ముగుస్తుందని గ్రహించిన మహిళలు కొందరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఇవిఎం)లను ధ్వంసం చేశారు. ఆవిధంగా వారు రీ పోలింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా బేరసారాలకు మూడు రోజులు వ్యవధి సంపాదించారు.
సీన్ 2: గుంటూరులో ఒక మురికివాడలో ఓటర్లు ఇద్దరు అభ్యర్థుల వద్ద నుంచి ఓటుకు రూ. 500 తీసుకున్నారు. కాని పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదు. ఎందుకంటే మూడవ అభ్యర్థి తమ పొరుగు కాలనీలో డబ్బు పంచినా తమ వార్డుకు రాలేదని ఆయనపై వారు ఆగ్రహించారు.
సీన్ 3: విజయవాడ శ్రీ రాజరాజేశ్వరిపేటలో ఒక కాంగ్రెస్ కార్యకర్త తన ఓటు కోసం తనకు నగదు ఇవ్వకుండా తనను అవమానించారంటూ పార్టీ నాయకులతో వాదనకు దిగాడు. ఒక పార్టీ కార్యకర్తగా డబ్బు తీసుకోవడానికి సిగ్గు పడాలని అతనితో నాయకులు చెప్పినప్పుడు అతను తనకు ప్రతిఫలం ముట్టచెప్పకపోతే స్థానికుల వద్ద తన పరువేమి కాను అని వారితో అన్నాడు.
సీన్ 4: ఒంగోలులో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అభ్యర్థి పి. ఆనంద్ పోల్ మేనేజర్లు ఇచ్చిన స్లిప్పులు (రూ. 2 కోట్లు విలువ చేసేవి)తో జనం స్థానిక కేబుల్ టివి ఆఫీసు ముందు నగదు పంపిణీ కోరుతూ ధర్నా నిర్వహించారు. ఓట్లు వేసిన తరువాత స్లిప్పులు చూపితే డబ్బు ఇవ్వగలమని తమతో చెప్పారని వారు వాదించారు. కేబుల్ టివి నెట్ వర్క్ లో మెజారిటీ వాటా ఉన్న ఆనంద్ ఆ నిరసన ప్రదర్శనల అనంతరం ఆ మొత్తం పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది.
ఎన్నికలలో చోటు చేసుకున్న ఇటువంటి అనేక ఉదంతాలలో ఇవి కొన్ని మాత్రమే. వాస్తవానికి 'ఎన్నికలు 2009'లో అభ్యర్థులు ఖర్చు చేసే మొత్తం పెరగడమే కాకుండా తమ ఓట్లు వేసినందుకు ఓటర్లు డబ్బు కోరే ప్రమాదకర ధోరణికి నాంది పడింది కూడా. గతానికి భిన్నంగా జనం అభ్యర్థులు ఇవ్వజూపే ముడుపులు తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించకపోవడమే కాకుండా అప్పటికప్పుడు చెల్లింపులను కూడా కోరారు.
'నగరంలో ఈ ధోరణి చూసి షాక్ తిన్నాను. నా రెండు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనలు నా దృష్టికి ఎన్నడూ రాలేదు' అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అంగీకరించారు. ఆయన గ్రామీణ పెదకూరపాడు సెగ్మెంట్ నుంచి ఈ దఫా గుంటూరు నగరానికి మారారు. ఎన్నికలలో తాను ఖర్చు చేసిన మొత్తాన్ని వెల్లడి చేయడానికి మంత్రి సిద్ధంగా లేకపోయినప్పటికీ ఈ ధోరణికి మీడియానే ఆయన తప్పు పట్టారు. 'తక్షణ ప్రతిఫలం గురించి జనం పట్టుబట్టితే ఇక భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కారం కోసం ఎవరు పాటుపడతారు' అని కన్నా ప్రశ్నించారు.
మంత్రి పోటీ చేసిన గుంటూరు (వెస్ట్) అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన నియోజకవర్గాలలో రెండవ స్థానం ఆక్రమించిందని ఎన్నికల నిఘా సంస్థ 'ఎలక్షన్ వాచ్' తెలియజేసింది. ఈ సంస్థ సమాచారం ప్రకారం పిఆర్పీ అభ్యర్థి తులసి రామచంద్ర ప్రభు అందరి కన్నా ఎక్కువగా రూ. 14 కోట్ల మేరకు ఖర్చు చేయగా తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి చుక్కపల్లి రమేష్ రూ. 12 కోట్లు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రూ 6 కోట్లు మేరకు వ్యయం చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కరణం బలరామ్ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో తాను ఏ ప్రత్యక్ష ఎన్నికలలోనూ పోటీ చేయబోనని తెలియజేశారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సమకాలికుడైన బలరామ్ భవిష్యత్తులో వాణిజ్యవేత్తలు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగలరని అన్నారు. 'దురదృష్టవశాత్తు, అభ్యర్థుల పని, అందుబాటు గురించి జనం ఆందోళన చెందడం లేదు. ఎన్నికల ముందు పంపిణీ చేసే డబ్బే ప్రధానం అవుతుంటే నేను పోటీ చేయబోవడం లేదు' అని బలరామ్ పేర్కొన్నారు.