ఇక చిరు డిన్నర్లు
హైదరాబాద్ : రానున్న పది రోజులలో మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నాయకులతో ముఖాముఖి సాగించేందుకు పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఒక విస్తృత కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇందుకు తేదీలను ఖరారు చేయకపోయినప్పటికీ తమ తమ నియోజకవర్గాలలో చిత్తశుద్ధితో పార్టీని జన బాహుళ్యం చేరువలోకి తీసుకుపోయిన కనీసం 20 మంది పేర్లను పంపవలసిందిగా కోరుతూ అభ్యర్థులు అందరికీ సందేశాలు వెళ్ళాయి. ఆ 20 మంది నాయకులు పార్టీ అధ్యక్షునితో నేరుగా మాట్లాడతారు. వారిని ఆతరువాత మండల, గ్రామ స్థాయిలలో 50 మంది నాయకుల పేర్లను నివేదించవలసిందిగా కోరతారు. ఆ 50 మంది పార్టీ అధ్యక్షుని నేరుగా డిన్నర్ లో కలుసుకుని తమ అనుభవాలను వివరిస్తారు.
ఓట్ల లెక్కింపు తేదీ మే 16 వరకు కేడర్లలో నైతిక స్థైర్యాన్ని కొనసాగించడానికే ఈ డిన్నర్ దౌత్యాన్ని తలపెట్టుతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాకపోతే తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ముందుగానే పూర్తి చేసిన ప్రక్రియను చిరంజీవి ఇప్పుడు చేపట్టడం విశేషం.
ఇది ఇలా ఉండగా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలోని అభ్యర్థుల నుంచి అందిన సమాచారం పిఆర్పీ అధ్యక్షునికి ఎంతో సంతృప్తి కలిగించినట్లు తెలుస్తున్నది. ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ పని తీరు మదింపు కోసం నిర్వహించిన సమీక్ష సమావేశాలు పార్టీకి ఆనంద సాగరంలో ఓలలాడిస్తున్నాయి. రెండు జిల్లాలలోని 34 అసెంబ్లీ స్థానాలలోకి 28 స్థానాలలో పార్టీ విజయం సాధించగలదని పార్టీ నాయకులు దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పార్టీ అధ్యక్షుడు తిరుపతి అసెంబ్లీ సీటును అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్న పక్షంలో పాలకొల్లులో ఏ అభ్యర్థి విజయం కోసమైనా తాము పాటుపడతామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
News Posted: 5 May, 2009
|