'బాబు, చిరు సగం సగం'
హైదరాబాద్ : మహా కూటమిలో తీవ్ర విభేదాలను ఏమాత్రం పట్టించుకోని సిపిఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)తో కలసి అధికారం పంచుకోవాలనే తన ప్రతిపాదనను తిరిగి రంగంపైకి తెచ్చారు. కాంగ్రెసేతర ప్రభుత్వం సుస్థిరతకు ఈ ఏర్పాటు తప్పనిసరి అని డాక్టర్ నారాయణ అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదన ఊహాజనితమే అయినప్పటికీ చర్చించడంలో తప్పు లేదు కదా అని ఆయన అంటున్నారు. అయితే, ఆయన ఈ ప్రతిపాదన గురించి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో గాని, పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవితో గాని చర్చించలేదు.
చంద్రబాబు నాయుడు, చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని చెరి సగం పంచుకోవాలని ఆరు నెలల క్రితం నారాయణ సూచించారు. హంగ్ శాసనసభ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆయన మళ్ళీ ఈ ప్రతిపాదన చేస్తున్నారు. తన ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తమవుతుందని ఆశిస్తున్న నారాయణ సోమవారం మీడియా సిబ్బందితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్, పిఆర్పీలను ఓడించి టెడిపి నాయకత్వంలోని మహా కూటమి తగినంత మెజారిటీతో విజయం సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు.
హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో సుస్థిర ప్రభుత్వం స్థాపన కోసం మహా కూటమి, పిఆర్పీ అధికారం పంచుకోవడానికి, కాంగ్రెస్ అవకాశాలని దెబ్బ తీయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం శ్రేయస్కరమని కూడా నారాయణ సూచించారు. 'అయితే, పిఆర్పీ, మహా కూటమికి ఎన్నెన్ని సీట్లు వస్తాయనే అంశంపై అది ఆధారపడి ఉంటుంది. పిఆర్పీకి 70 నుంచి 80 వరకు సీట్లు లభించే పక్షంలో చంద్రబాబు, చిరంజీవి తమ తమ అజెండాలతో చెరి రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం మంచిది' అని ఆయన అన్నారు. అయితే, 'పిఆర్పీ, మహా కూటమి లేదా చివరకు కాంగ్రెస్ సొంతంగానే మెజారిటీ సాధించినట్లయితే ప్రజల తీర్పును మనం మన్నించవలసి ఉంటుంది. కాని ఏ పార్టీకీ సాధారణ మెజారిటీతో సీట్లు రాని పక్షంలో ప్రత్యామ్నాయాల గురించి మనం అన్వేషించాలి' అని నారాయణ పేర్కొన్నారు.
తృతీయ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి తలెత్తినట్లయితే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు పిఆర్పీ, మహా కూటమి సంఘటితం కావడం తప్పేమీ కాదని నారాయణ అన్నారు. కాగా నారాయణ ప్రతిపాదనపై పిఆర్పీ సీనియర్ నాయకుడు చేగొండి హరి రామజోగయ్య వ్యాఖ్యానిస్తూ, 'రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాం. కాని కేంద్రంలో మా ఎంపిల మద్దతుకు బదులుగా ఇక్కడ సిఎం పదవిని చిరంజీవికి ఇవ్వడం వంటి ప్రతిపాదన స్వాగతించదగినదే' అని అన్నారు.
News Posted: 6 May, 2009
|