ఇస్రోలో ఉద్యోగాల వేట
ముంబై : భారతదేశం 'చంద్రయాన్ 1'ను విజయవంతంగా ప్రయోగించడం దేశం బ్రాండ్ విలువను అమితంగా పెంచడమే కాకుండా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోగాల కోసం యువకుల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు సంస్థ కార్యాలయాలకు వచ్చాయి. ఇది కనివినీ ఎరగని పరిణామమని సంస్థ అధికారులు చెబుతున్నారు.
చంద్రయాన్ విజయం ఇస్రోలో ఉద్యోగాలకు డిమాండ్ ను పెంచిందని ఇస్రోకు అనుబంధితమైన, హైదరాబాద్ కేంద్రంగా గల నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఎ) డైరెక్టర్ వి. జయరామన్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరికి తెలియజేశారు. 'ప్రధానంగా చంద్రయాన్ కారణంగా సంస్థకు గ్లామర్ విలువ చేకూరింది. దేశమంతటి నుంచి పది, పదకొండు తరగతుల విద్యార్థులు అధిక సంఖ్యలో మా సంస్థకు దరఖాస్తులు పంపుతున్నారు. చివరకు వారి తల్లిదండ్రులు కొందరు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు' అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్రోలో వివిధ కేటగరీలలో 300 ఉద్యోగాలకు లక్షా 35 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు జయరామని వెల్లడించారు. ారిలో దాదాపు 70 వేల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హత పొందారని, ఆ పరీక్ష ఏప్రిల్ 26న జరిగిందని, కాని దాదాపు 46 వేల మంది పరీక్ష రాశారని ఆయన తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు మరీ తక్కువగా ఉన్నందున అంతరిక్ష సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదనుకుని దాదాపు 20 వేల మంది పరీక్షకు హాజరు కాలేదు.
'ముంబై, న్యూఢిల్లీ, చెన్నై వంటి కేంద్రాల నుంచి మాకు సాధారణంగా సగటున దాదాపు 4000 నుంచి 5000 వరకు దరఖాస్తులు అందుతుంటాయి. అయితే, ఈ సంవత్సరం ఈ ప్రదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు అందాయి' అని జయరామన్ చెప్పారు. స్క్రీనింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు, ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 'ఇస్రోలో వేతన ప్యాకేజి సంతృప్తికరం' అని జయరామన్ చెప్పారు. ఈ సంవత్సరం యువకులు అధిక సంఖ్యలో ఇస్రోకు దరఖాస్తు చేయడానికి ఆర్థిక మాంద్యం కూడా ఒక కారణమని ఎన్ఆర్ఎస్ఎ చీఫ్ పేర్కొన్నారు. 'ఐటి కంపెనీలు, ఇతర సంస్థలలో లే ఆఫ్ లతో యువకులు ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోరడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. వారిలో చాలా మంది ఇస్రో అత్యుత్తమ సంస్థగా భావిస్తున్నారు. ఎందుకంటే సంస్థలో పని వాతావరణం బాగుంటుంది' అని జయరామన్ వివరించారు. కాగా, ఈ 300 ఖాళీలకు కూడా ప్రాతిపదిక రిటైర్ మెంట్లు, భవిష్యత్ ప్రాజెక్టు అవసరాలని ఇస్రో ముఖ్య అధికార ప్రతినిధి ఎస్. సతీష్ తెలియజేశారు. ఐటి సంస్థలలో ఉద్యోగాల కోసం ఇస్రోను వదలివెళ్ళినవారిలో అనేక మంది కూడా తిరిగి ఈ సంస్థకు రావాలని కోరుకుంటున్నట్లు సతీష్ తెలిపారు.
News Posted: 7 May, 2009
|