ఏదైనా గెలుపు నాదే!
హైదరాబాద్ : ఈ నెల 16న ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించిన అనంతరం హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో 'బొమ్మ అయితే నేను గెలిచినట్లు, బొరుసు అయితే నువ్వు ఓడినట్లు' అనే వ్యూహాన్ని అనుసరించాలని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) యోచిస్తున్నది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, మహా కూటమి (జిఎ)లకు పిఆర్పీ మద్దతు కావలసి వచ్చినట్లయితే ప్రభుత్వానికి తాను సారథ్యం వహించాలనే షరతును పిఆర్పీ విధించగలదు. కాంగ్రెస్ గాని, తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకత్వంలోని మహా కూటమి గాని ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లయితే, పీఆర్పీ ప్రతిపక్షంలో కూర్చొనగలదు. అయితే, పిఆర్పీకి మెజారిటీ లభించగలదని పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీలో ఉన్నత స్థాయి నాయకులు పలువురు అంత భరోసాగా వ్యవహరించలేకపోతున్నారు.
పిఆర్పీకి సుమారు 100 శాసనసభ స్థానాలు లభించవచ్చునని, ఇతర ప్రధాన పార్టీలకు కూడా దాదాపుగా అదే సంఖ్యలో సీట్లు రావచ్చునని ఆ నాయకులు సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని చెప్పుకోలేదు. వారికి ఉండే ఏకైక మార్గం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అదే జరిగినట్లయితే, పిఆర్పి ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. పిఆర్పీ సంకీర్ణానికి సారథ్యం వహించి, చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లయితే, అది పార్టీకి ఎంతైనా మేలు చేయగలదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ పార్టీ తన మాట నెగ్గించుకోగలదు.
రాష్ట్రంలో ఏ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిననా అది ఎక్కువ కాలం కొనసాగజాలదని, త్వరగానే కూలిపోవచ్చునని, ఫలితంగా మధ్యంతర ఎన్నికలు రావచ్చునని పిఆర్పీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి పరిస్థితులలో పాలనాధికారం చేతుల్లో ఉంటే పిఆర్పీ మధ్యంతర ఎన్నికలను అవకాశంగా తీసుకుని లబ్ధి పొందగలదు. ఎన్నికల ప్రణాళికల తాను ప్రకటించిన కార్యక్రమాలను అమలు పరచడం ద్వారా పిఆర్పీ తన బలాన్ని పెంచుకోగలుగుతుందని, పార్టీ కేడర్ లో విశ్వాసాన్ని పాదుకొల్పగలుగుతుందని, కొందరు నాయకులకు పదవులు ఇవ్వడంతో పాటు తన అజమాయిషీలో ప్రభుత్వ యంత్రాంగం ఉండడాన్ని అవకాశంగా తీసుకోవచ్చునని పిఆర్పీ నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు.
అయితే, టిడిపి ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోవచ్చునని, కాంగ్రెస్ తదుపరి ప్రత్యామ్నాయం కాగలదని పిఆర్పీ నాయకులు భయపడుతున్నారు. తాము పిఆర్పీతో కలసి సాగగలమని వామపక్షాల నాయకులు ఇప్పటికే ప్రకటించినందున కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వామ్య పక్షాలుగా సంకీర్ణం ఏర్పడేట్లు పిఆర్పీ వ్యూహకర్తలు చూడగలరు.
News Posted: 7 May, 2009
|