వాస్తు దోషమే కారణం?
హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదానికి కొన్ని దోషాలే కారణమని వాస్తు నిపుణులు పేర్కొన్నారు. ఆగ్నేయంలో దోషాల వల్ల గడచిన ఐదు సంవత్సరాలలో సచివాలయంలో 11 అగ్ని ప్రమాదాలు సంభవించాయని వారు చెప్పారు. ఏ కట్టడానికీ ఆగ్నేయ మూలలో ఎటువంటి గొయ్యి లేదా పల్లపు ప్రాంతం ఉండరాదని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఆగ్నేయానికి సమీపంలో ట్యాంకులతో పెట్రోల్ బంకు ఉన్నందున పదేపదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు చెబుతున్నారు. దక్షిణానికి అధిపతి అంగారకుడు అని, ఈ గ్రహాన్ని అగ్ని అని కూడా పేర్కొంటారని వారు చెబుతున్నారు.
వాస్తు నిపుణులు ఇతర దోషాల గురించి కూడా ప్రస్తావిస్తూ, సచివాలయపు తూర్పు గోడ నిట్టనిలువుగా లేదని, సచివాలయం ఆగ్నేయ మూల రోడ్డు అంతమవుతున్నదని, నైరుతి వైపు గోడ ఈశాన్యం వైపు గోడ కన్నా ఎక్కువగా బయటకు చొచ్చుకు వచ్చిందని, సచివాలయం ప్రవేశద్వారం గోడకు ఆనుకుని కాకుండా కాస్త లోపలికి ఉన్నదని తెలియజేశారు. తరచు అగ్నిప్రమాదాలు సంభవించడానికి ఇవి ప్రధాన కారణాలని వారు పేర్కొన్నారు.
'అంగారకుడు అగ్ని దేవత. దక్షిణ దిక్కుకు అధిపతి. అగ్ని రాజేయడానికి ఈ దిక్కు సరైన ప్రదేశం అయినందువల్లే వంటగదులను ఈ దిక్కులో నిర్మిస్తుంటారు. ఆగ్నేయంలో ఎటువంటి గోతులు గాని, పల్లపు ప్రాంతం గాని ఉండరాదు. అయితే, ఇక్కడ గోతులు, పెట్రోల్ బంకు ఉన్నాయి. మార్పులు చేయని పక్షంలో ఏ ముఖ్యమంత్రి అయినా అవమానంతోనే నిష్క్రమించవలసి వస్తుంది' అని వాస్తు నిపుణుడు ఫణి రాజ్ అభిప్రాయం వెలిబుచ్చారు.
సచివాలయానికి వాయవ్యం వైపు ఉన్న గేటును వాస్తుకు విరుద్ధంగా ఉన్నదని చెప్పి ప్రభుత్వం మూసివేసినప్పటికీ అది సరిపోదని వాస్తు పండుతులు అంటున్నారు. ఆ గేటును పూర్తిగా తొలగించి అక్కడ ఒక గోడ నిర్మించాలని వారు సిఫార్సు చేస్తున్నారు.
News Posted: 9 May, 2009
|